పెద్దపల్లి, (ప్రభన్యూస్): గణశ్ నిమజ్జన ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి సీఐ ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పద్దపల్లి పోలీస్‌స్టేషన్లో మండప నిర్వాహకులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో సీఐ మాట్లాడుతూ వినాయక నిమజ్జన సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా వేడుకలు జరుపుకోవాలన్నారు.
ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా ప్రజలంతా సహకరించాలని కోరారు. నిమజ్జనం జరిగే ఎల్లమ్మ చెరువుతోపాటు ఇతర ప్రాంతాలలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం జరిగే ఎల్లమ్మ చెరువులోకి ఎవరు దిగకుండా ఉత్సవ సమితి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రాజేశ్‌తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.