ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్పూర్తి అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్పూర్తి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపించిన తెగువ ప్రపంచంలోనే తెలంగాణకు గుర్తింపు తెచ్చిందని కొనియాడారు. తమ హక్కుల కోసం కొట్లాడే వారికి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలు ఐలమ్మ పోరాట స్ఫూర్తితో అధిగమించాలని సూచించారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ పోరాటయోధులకు సముచిత గౌరవం లభించిందన్న మంత్రి, ఐలమ్మ ఆశయాల ను నెరవేర్చడమే ఆమెకు మనమంతా ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు. కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ అన్నపూర్ణమ్మ, జడ్పిటిసి జీడి బిక్షం, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ,కార్మిక సంఘం నేత వై.వీ, తదితరులు పాల్గొన్నారు.