Friday, November 22, 2024

పేద ప్రజల కోసం పోరాడిన దీరవనిత చాకలి ఐలమ్మ… మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్నగర్, సెప్టెబర్10 (ప్రభ న్యూస్): భూమి కోసం భుక్తి కోసం నా పోరాటం అని చాటిచెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు.చాకలి ఐలమ్మ 38 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న గ్రీన్ బెల్టులో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఏ ఒక్క కులం కోసమో, వర్గం కోసమో పోరాటం చేయలేదని ,పీడిత ,పేద వర్గాల కోసం కొట్లాడిన ధీర వనిత అని అన్నారు. ఆనాటి దొరలు అహంకారంతో ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం, బడుగు, బలహీన వర్గాల పేదలు పండించిన పంటలను, గొర్రెలు, చేపలు వంటి వాటిని ఎత్తుకెళ్లడం, దాడులు చేసి అత్యాచారాలు చేయడం వంటి వాటికి ఎదురు నిలిచి ఎదురుదాడి చేసి కొట్లాడిన మహా నాయకురాలని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం చాకలి ఐలమ్మ వారి వంటి మహనీయుల స్ఫూర్తితో వచ్చిందని, చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, సురవరం ప్రతాపరెడ్డి, సర్దార్ సర్వాయి పాపన్న, పండగ సాయన్న ,బసవేశ్వరుడు వంటి మహనీయుల విగ్రహాలను గ్రీన్ బెల్ట్ లో ఏర్పాటు చేసుకున్నామని, వారందరి స్ఫూర్తితో జిల్లా ప్రజలు ముందుకు నడిచేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అని అన్నారు.

త్వరలోనే గ్రీన్ బెల్ట్ లో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని, భగీరథ మహర్షి విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తామని, రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో గ్రీన్ బెల్ట్ మొత్తాన్ని సుందరీకరించనున్నామని తెలిపారు.జిల్లాలోని రజకుల కోసం కోటి రూపాయలతో అధునాతన వాషింగ్ మిషన్లను, డ్రైయర్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరో నాలుగైదు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.అలాగే ఇండ్లు లేని 30 మంది రజకులకు , 25 మంది నాయి బ్రాహ్మణులకు, 135 మంది చర్మకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంతేకాక ఇస్త్రీ షాపులు నిర్వహించుకునే రజకులకు 250 యూనిట్ల వరకు ఎలాంటి విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా రాయితీ ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా సెలూన్లు నిర్వహించుకునే నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు రాయితీని ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు.పేద, బడుగు, బలహీన వర్గాల వారు బాగుండడమే తమ ధ్యేయమని అన్నారు. హైదరాబాదులో అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని, అన్ని కులాలు, వర్గాల పేదలకు సహాయం చేయడమే తమ ధ్యేయమని తెలిపారు. ప్రజల కోసమే మేమున్నామని, జీవితం పేద ప్రజల కోసం అంకితం చేస్తామని, గతంలో తాగడానికి సైతం నీరులేని పరిస్థితి నుండి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎదిగిందని, పాలమూరు- రంగారెడ్డి కింద ఎకరా భూమి వదలకుండా. సాగు నీటిని ఇస్తామని ,భవిష్యత్తులో బ్రతకడానికి మహబూబ్నగర్ కు వచ్చేలా చేస్తామని మంత్రి తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల కోసం పోరాడిన దీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలకు గౌరవం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.రజక సంఘం జిల్లా అధ్యక్షులు పురుషోత్తం మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్ ,మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, నవకాంత్, పట్టణ రజక సంఘం అధ్యక్షులు మల్లేష్, బెక్కెం జనార్దన్, కౌన్సిలర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ ఇంజనీర్ బెంజమిన్, గోవర్ధన్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement