Friday, November 22, 2024

TS: బీజేపీకి ఓటేస్తే.. బానిస బతుకులే.. మంత్రి కొండా సురేఖ

ఉమ్మడి మెదక్ బ్యూరో : లోక్ స‌భ‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే అందరివి బానిస బతుకులు అవుతాయని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాలని ఆమె సూచించారు. సీపీఎం బలపరిచిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం సీపీఎం విస్తృత స్థాయి సమావేశం సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్ లో జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న ప్రధాని మోదీకి పేదల కష్టాలు, సంక్షేమం, చదువులు, వైద్యం కనిపించవని దుయ్యబట్టారు. కేవలం ఆదానీ, అంబానీలకు ఏం కావాలో? చూస్తారని విమర్శించారు.

స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే అనేక పరిశ్రమలను నెలకొల్పడం జరిగిందని, వేలాది మందికి ఉపాధి దక్కిందని గుర్తు చేశారు. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ హాయాంలోనే ఐటీ రంగానికి బీజం పడిందని, మహిళా రిజర్వేషన్లు బిల్లు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. 25 ఏళ్లు వెనుకబాటుకు గురైన మెదక్ ప్రాంతం అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీసీ యువనేత నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

మతోన్మాద శక్తులను ఎదిరించాలి…సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు..
దేశంలో మతోన్మాద రాజకీయ శక్తులను ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. ఆ దిశగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పటికే దేశంలోని పలు సంస్థల ప్రైవేటీకరణకు ప్రోత్సహించిన మోడీ రైతాంగంపై కూడా కన్నేసారని విమర్శించారు. రైతుల పంటలకు మద్దతు ధర, రైతన్న చట్టాలను అమలు చేయకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కార్మిక చట్టాలు ఖతమవుతాయన్నారు. ఈ దేశంలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ బీసీల కుల గణనకు ముందుకు రావడానికి సీపీఎం స్వాగతిస్తోందని పేర్కొన్నారు. దేశ ప్రధాని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ కూడా మౌన పాత్ర వహిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక అవినీతి పరిపాలన బీఆర్ఎస్ కొనసాగిందని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని స్పష్టం చేశారు. మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రజా సంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తా.. ఎంపీ అభ్యర్థి నీలం మధు
తనను ఎంపీగా గెలిపిస్తే, ఎల్లవేళలా నియోజకవర్గానికి అందుబాటులో ఉంటానని ఎంపీ అభ్యర్థి నీలం మధు తెలిపారు. అలాగే టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిర ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు పులి మామిడి రాజు, సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం, సీఐటీయూ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, సీపీఎం జిల్లా నాయకులు మల్లేశం, రాజయ్య, వాజిద్ అలీ, మాణిక్యం, మూడు జిల్లాల సీపీఎం నాయకులు, సీఐటీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సీపీఎం నేతలు మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధును శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement