- హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఘటన
- ఆందోళన వ్యక్తం చేస్తున్న చిన్నారి బంధువులు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ప్రస్తుతం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఉంటూ సరైన వైద్యసేవలు అందించకపోవడంతో ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఐదేళ్ల చిన్నారి కంట్లో నలుసు పడిందని హాస్పిటల్ కు పోతే ఆపరేషన్ అని చెప్పి నిర్లక్ష్యంగా బలితీసుకున్నారు. అన్విక (5) కంటిలో నలక పడిందని హైదరాబాద్ హబ్సిగూడలోని ఓ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు.
ఆపరేషన్ అని చెప్పి…
కంటిలో నలక తీసేయాలంటే సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్విక సర్జరీ చేసేముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో ఐ హాస్పిటల్ డాక్టర్లు అప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియకుండా అన్వికను ఎల్బీనగర్ పిల్లల హాస్పిటల్ కు తరలించారు. ఆ హాస్పిటల్ వైద్యులు పాప మృతి చెందినట్లు నిర్ధారించారు. తీరా తల్లిదండ్రులకు తెలియడంతో లబోదిబోమన్నారు. ఐ ఆస్పత్రి నిర్లక్ష్యమే మృతికి కారణమని బంధువులు ఆరోపించారు.