అభివృద్ధిలో రాజకీయాలు వద్దు..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : తప్పులు చేసే వారిపై చట్టపరంగా శిక్షలు తప్పవని, పోలీసు కేసులు పడకుండా ప్రజలు బాధ్యతతో మెలగాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో డీఆర్డీఏ ద్వారా ఇందిరమ్మ శక్తి క్యాంటీన్ మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమాండ్ యూనిట్ ను ప్రారంభించి పోలీసు శాఖలో సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరచడం జరిగిందన్నారు. తప్పులు చేసే ఎంతటి వారైనా దండన తప్పదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేలా ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు.
అనంతరం దస్నాపూర్ లో రూ.10.53కోట్ల వ్యయంతో రోడ్లు, సీసీ డ్రైనేజీల శంకుస్థాపనలు, మావల ఎంపీడీవో కార్యాలయంలో అదనపు గదులు, దుబ్బగూడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళా వికాస్ జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా సమైక్య నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, విద్యుత్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ… అర్హులైన పేదలందరికీ పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని, పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ అలం, ఎమ్మెల్సీ దండే విట్టల్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డీ భోజా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమెందర్, డీఆర్డీఏ పీడీ రవీందర్, కౌన్సిలర్లు , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.