Saturday, November 23, 2024

MBNR | అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు అడిగితే.. అరెస్టులా ?

రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్
తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుల పాలైన మాజీ సర్పంచుల బాధలు వర్ణణాతీతమని సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ అన్నారు. గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసి దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటని రాష్ట్రవ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన 1500 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సర్పంచుల పెండింగ్ బిల్లుల సాధనకై చలో హైదరాబాద్ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చిన రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలను, ఆయా సర్పంచులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించినట్లు తెలిపారు. అరెస్టు చేసిన సర్పంచులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

పెండింగ్ బిల్లులు విడుదల చేసేంతవరకు సర్పంచుల పోరాటం ఆగదని ఆయన తెలిపారు. నేడు జడ్చర్ల పోలీసులు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు ప్రనిల్ చందర్, జడ్చర్ల మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్, రాజేశ్వర్ రెడ్డిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సరైనది కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement