Tuesday, November 26, 2024

TS: రాహుల్ బాబాకు దేశాన్ని అప్పగిస్తే అధోగతి పాలే.. వ‌న‌ప‌ర్తి స‌భ‌లో అమిత్ షా

నరేంద్ర మోడీని దేశం, ప్రపంచం గౌరవిస్తోంది.
రామ మందిర ప్రారంభానికి కాంగ్రెస్ మోకాలడ్డు
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంచుతాం
వనపర్తి బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

వనపర్తి, మే 11 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ బాబాకు దేశాన్ని అప్పగిస్తే అధోగతి పాలు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శనివారం వనపర్తిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డి జూటాకోర్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అపహాస్యం చేశాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాటు అధికారంలో ఉండి 12 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నీతివంత పాలన సాగిస్తూ అవినీతి లేని నాయకుడిగా దేశం, ప్రపంచం గౌరవిస్తోందన్నారు.

అయోధ్యలో 500 ఏళ్లుగా రామ మందిరం నిర్మాణానికి నోచుకోక హిందువులు మానసిక వేదన చెందితే నరేంద్ర మోడీ ఉక్కు సంకల్పంతో దేశంలో ఎక్కడ అల్లర్లు జరగకుండా అందరినీ ఒప్పించి రామ మందిర నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రారంభానికి రాకుండా హిందూ ధర్మం కలిగిన కాంగ్రెస్ నాయకులకు అడ్డు పడిందని చెప్పారు. హైదరాబాద్ లో రాహుల్ బాబా కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఓవైసీ కోసం పరితపిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు రైతు పెట్టుబడి కింద ఏడాదికి 15,000 రైతుల ఖాతాలో జమ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని, ధాన్యానికి క్వింటాలుకు 500బోనస్, నిరుద్యోగ యువతకు వారి ఖాతాలో ఐదు లక్షలు జమ చేస్తామని, విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఏవీ ఇవ్వలేదని మండిపడ్డారు.

ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పి నేటికీ అతీ గతీ లేదన్నారు. రైతులకు డిసెంబర్ 9న 2లక్షల రుణమాఫీ చేస్తానని మొండిచేయి చూపారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ అవమానం చేయగా, నరేంద్ర మోడీ సారథ్యంలో అంబేద్కర్ జన్మదినాన్ని గుడ్ గవర్నెన్స్ గా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. 26 జనవరి రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ గా అంబేద్కర్ జన్మస్థలాన్ని అభివృద్ధి చేయడంతో పాటు లండన్ లో ఆయన చదువుకున్న కళాశాలను అభివృద్ధి పరిచేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నాగపూర్ లో ఆయన పెరిగిన స్థలాన్ని కూడా జీవ భూమిగా నిర్మాణం చేసి 5 పంచ్ కేంద్రాలుగా తీర్థ స్థలాలుగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీకి దక్కిందన్నారు. నాగర్ కర్నూల్ కు అనేక అభివృద్ధి నిధులు ఇచ్చామని కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు జాతీయ రహదారి విస్తరణకు 820 కోట్లు మంజూరు చేయడంతో పాటు సోమశిల వద్ద కృష్ణా నదిపై ఐకాన్ బ్రిడ్జి నిర్మాణానికి 1100 కోట్లు మంజూరు చేశామన్నారు. అచ్చంపేటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూపకల్పన చేశామని చెప్పారు.

- Advertisement -

దేశానికి శాంతితోపాటు గౌరవ మర్యాదలు మరింత పెరగాలంటే నాగర్ కర్నూల్ లోక్ స‌భ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ కు ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో లోక్ స‌భ‌ అభ్యర్థి భరత్ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు డి.నారాయణ, టి. ఆచారి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎల్ లేని సుధాకర్ రావు, ప్రేమేందర్ రెడ్డి, నాయకులు రావుల రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, సబి రెడ్డి వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బచ్చు రాము, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి జిల్లా బీజేపీ నాయకులు కొత్త కాపు శివారెడ్డి, బీజేపీ వనపర్తి జిల్లా మహిళా మోర్చా అశ్విని రాధ, రామన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement