హైడ్రా బుల్డోజర్లు ముందు మా మీద నుండి వెళ్ళాలి.. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు వెళ్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ బర్కత్‌పురాలోని బీజేపీ సిటీ సెంట్రల్ జిల్లా ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన సేవా పక్వాడ ఫోటో ఎగ్జిబిషన్‌ను రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, బండి సంజయ్, తదితర నేతలు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి బండి మాట్లాడుతూ ‘ప్రజాలరా… మీకు అండగా బీజేపీ ఉంది. మీ ఆస్తులను రక్షించే బాధ్యత తీసుకుంటాం. మీ ఆయుధం మేమవుతాం. పేదలకు ఆయుధంగా బీజేపీ మారబోతోంది. మీ ఇండ్లపై హైడ్రా బుల్డోజర్లు దిగాలంటే.. ముందు బీజేపీ కార్యకర్తలపైన, మాపైన బుల్డోజర్లపై దిగిన తరువాతే మీ ఇండ్లను తాకాలి. అందుకు పూర్తిగా సన్నద్ధమై ఉన్నం. ప్రభుత్వం కూడా పేదల ఇండ్ల కూల్చే ముందు దానికి సిద్ధం కండి. ఈ విషయంలో ఎందాకైనా తెగించి కొట్లాడేందుకు రెడీగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా, ఏ వ్యక్తిని కదిలించినా హైడ్రా దాడులపైనే చర్చ జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. హైడ్రా దాడులను చూసి బాధపడనోడు పాపాత్ముడని విమర్శించారు. మరి ప్రభుత్వం ఎందుకు పున: సమీక్షించుకోవడం లేదో అర్థం కావడం లేదని, పైగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు.
సర్కార్ తీరు డామిట్ కథ అడ్డం తిరిగినట్లుగా ఉందన్నారు. పెద్దలు ఆక్రమించిన భవనాలను కూలగొడతారని తాము మొదట భావించామని, కానీ పేదల ఇండ్లు కూలుస్తున్నారని ఆరోపించారు. కొత్త ఇల్లు కట్టుకుని గ్రుహ ప్రవేశం చేస్తే.. ఆ ఇంటి తోరణాలు వాడకముందే వచ్చి కూల్చేస్తున్నారని, అన్ని అనుమతులు తీసుకుని, బ్యాంకు రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే.. వాటిని కూల్చడం ఎంత వరకు న్యాయం? ఆ ఇండ్లపై దాడులు చేస్తే వాళ్లకు దిక్కెవరు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ తీరుతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నదన్నారు. ప్రభుత్వ దాడులకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పేదలకు ఆయుధంగా బీజేపీ మారబోతోందని, ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాడుతుందని వెల్లడించారు. బీఆర్ఎస్ కు, మీకు తేడా ఏముంది? గతంలో బీఆర్ఎస్ కూడా ఇట్లనే చేసిందని ఫైర్ అయ్యారు.