హైదరాబాద్ : వడ్డీ వ్యాపారులు ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్–1 ఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. కొంత మంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. డబ్బు చెల్లించని వారి నుంచి బలవంతంగా ఇల్లు, పొలాల పత్రాలను తీసుకుంటున్నట్టుగా ఫిర్యాదులు అందడంతో రంగనాథ్ స్పందించారు.
మల్టీజోన్–1 జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సంస్థల ప్రాంగణాల్లో జిల్లాల ఎస్పీలు సోదాలు చేపట్టారు. ఈ మేరకు ఐజీ ఆఫీసు ప్రెస్ నోట్ వెలువరించింది. దాడుల్లో వడ్డీ వ్యాపారుల ఇండ్లు, సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం, విలువైన డాక్యుమెంట్లు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోర్టుల్లో అందజేయడంతో పాటు డబ్బును ఇన్ కంట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 3 రోజులుగా దాడులు చేపట్టామని వెల్లడించారు.