ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని దొంగ హామీలైనా ఇచ్చేందుకు సిద్ధమయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. చంద్రయాన్ 3 విజయవంతమైన నేపథ్యంలో ప్రజలను నమ్మించేందుకు బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఒక్కో కుటుంబానికి చంద్ర మండలంలో 3ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కేసీఆరే చెప్పారని, అట్లాంటప్పుడు వారందరినీ బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించడం విడ్డూరమన్నారు.
దీని వెనుక కేసీఆర్ మాస్టార్ ప్లాన్ ఉందని, తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి అందులో సగం మందికి టిక్కెట్లు ఇవ్వకుండా ఎగ్గొడతారని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుసుకున్న కేసీఆర్.. దీనిని అడ్డుకునేందుకు హడావుడిగా అందరికీ టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటిస్తూ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని చెప్పారు.
ఎమ్మెల్యే ప్రవాసీలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొద్దిసేపు చర్చించారు.
కర్నాటక, తమిళనాడు, యూపీ, అసోంకి చెందిన ఎమ్మెల్యేలు సీకే రామస్వామి, బస్వరాజ్, ధర్మేశ్వర్ కోన్వర్, దిగంత కలిత, మునిరాజ్, శశాంక్ త్రివేది, హేమంత తగురియా తదితరులు బండి సంజయ్ ను కలిసిన వారిలో ఉన్నారు. అంతకుముందు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలతో కలిసి బండి సంజయ్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయాన్ని సందర్శించారు. వారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.