మహబూబ్ నగర్, నవంబర్ 23 (ప్రభ న్యూస్): మరింత అభివృద్ధి కావాలంటే తనను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులను పోల్చి చూడండని… ఎవరు అభివృద్ధి చేస్తారో ఆలోచించాలని కోరారు. గురువారం స్థానిక అసోసియేషన్ లో మంత్రి న్యాయవాదులను కలిసి ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి వల్ల నియోజకవర్గం బాగుపడుతుందో ఆలోచించి వారికే పట్టం కట్టాలని కోరారు.
ఇవాళ మధ్యాహ్నం స్థానిక బార్ అసోసియేషన్ లో న్యాయవాదులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు… తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న మహబూబ్ నగర్… ఈ పదేళ్లలో అభివృద్ధి జరిగిన తర్వాత మహబూబ్ నగర్ కు తేడాను గమనించాలన్నారు. హైదరాబాద్ లో మహబూబ్ నగర్ ను ఒక భాగంగా మారుస్తామన్నారు. న్యూ యార్క్, లండన్ వంటి మహా నగరాల నుంచి 200 కి.మీ దూరం ఉన్న ప్రాంతాలను కూడా ఆ నగరంలో భాగంగానే భావిస్తారన్నారు. నియోజకవర్గం పట్ల తనకు సామాజిక బాధ్యత ఉందని, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయంగా మంత్రి పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి, కులాల కుంపట్లు రగిల్చే వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కోరారు. మహబూబ్ నగర్ బ్రాండ్ వ్యాల్యూ పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి రాంనాథ్ గౌడ్, న్యాయవాదులు కే ప్రతాప్ కుమార్, చంద్రమౌళి, హనుమంతు, జాకీర్, టీ వెంకట రామ శర్మ, జగదీశ్వర్ రెడ్డి, స్వదేశ్, తదితరులు పాల్గొన్నారు.