హైదరాబాద్ : అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి అవకాశమివ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని విజ్ఞాన పురి కాలనీలో జరిగిన కాలనీవాసుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అభివృద్ధికి బాటలు వేసాను… ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నానన్నారు. తాము వేసిన రోడ్లలో తిరుగుతూ అభివృద్ధి చేసిన పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతూ ఏర్పాటు చేసిన గ్రౌండ్లలోనే సభలు నిర్వహిస్తూ కొన్ని పార్టీల నాయకులు ఏం చేసారని అడుగుతుంటారన్నారు.
ఎన్నికలు, వర్షాలు, కరోనాతో ఇబ్బందులు పడ్డ నియోజకవర్గానికి వేల కోట్లతో అభివృద్ధి చేసానన్నారు. అభివృద్ధి కొనసాగలాంటే మరొక్కమారు అవకాశం ఇవ్వండని అన్నారు. వర్షాలు వచ్చినపుడు, కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు కానరాని నేతలంతా ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. మరొక సారి అవకాశం కల్పిస్తే… మరింత డెవలప్ మెంట్ చేస్తానన్నారు.