ప్రభన్యూస్ : అక్రమంగా అటవీ భూములను దున్నితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పోడు భూముల పట్టాలను పొందాలనే ఉద్దేశంతో ఇటీవల పలు జిల్లాల్లో కొందరు అక్రమార్కులు అటవీ భూములను చదును చేస్తూ వ్యవసాయ భూములుగా మారుస్తున్న ఘటనలు అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా భూముల్లో క్షేత్రస్థాయిలో తనికీలు చేపట్టారు. ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో హరితహారంలో భాగంగా నాటిన వేలాది మొక్కలను తొలగించి, వ్యవసాయ భూములుగా మార్చిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇలాంటి ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బయటపడింది. ఆ జిల్లాలోని గౌరారం గ్రామంలో సుమారు 180 ఎకరాల అటవీ భూమి ఉంది. అయితే అక్కడ సాగులో లేని అటవీ భూమిని కొంతమంది వ్యక్తులు దున్నుతుండగా అధికారులు అడ్డుకున్నారు. వారి వివరాలను సేకరించి అటవీభూమిని దున్నరాదంటూ వారికి అధికారులు నచ్చచెప్పారు. 2005 డిసెంబర్ 31 కటాఫ్ తేదీ మేరకే నిజమైన పోడు సాగు దారులకు మాత్రమే హక్కుల పత్రాలు వస్తాయని, కొత్తగా అటవీ భూములను ఆక్రమించి పోడు భూములుగా మారిస్తే పట్టాలు రావని అధికారులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..