బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 8 నుండి 12 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియా మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పినట్లుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సైతం ఈ సందర్భంగా కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు.. మా పార్టీలోకి వస్తామంటున్న 25 మంది ఎమ్మెల్యేల పేర్లు నేను చెబుతా. మరీ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లోకి వెళ్లే పాతిక మంది ఎమ్మెల్యేల పేర్లు కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. తాము అర్భకులం కాదని.. అర్జునులమై అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తోందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.