తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే అర్హత, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కర్నాటక లింగసుగుర్ శాసనసభ్యులు, కరీంనగర్ ఎన్నికల ఇంఛార్జీ మానప్ప ఒజ్జల్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలవబోయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కరీంనగర్ అసెంబ్లీ మొదటి స్థానంలో ఉందన్నారు. మెజారిటీ ఎంత వస్తుందనే దానిపైనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ మేరకు తమకు నివేదికలు అందాయన్నారు. ఈరోజు జూబ్లినగర్ లో జరిగిన కరీంనగర్ రూరల్ మండల నాయకులు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల విస్త్రతస్థాయి సమావేశంలో మానప్ప ఒజ్జల్ మాట్లాడుతూ… బండి సంజయ్ హార్డ్ వర్క్, కరీంనగర్ కార్యకర్తల కష్టపడే తత్వం వల్లే గెలుపు ఈజీగా మారిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బండి సంజయ్ ను కనీవినీ ఎరగని రీతిలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానన్నారు.
అనంతరం కర్నాటక ఎమ్మెల్సీ, ఎన్నికల జోనల్ ఇంఛార్జీ కేశవప్రసాద్ మాట్లాడుతూ… బండి సంజయ్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారన్నారు. తెలంగాణ అంతటా ప్రచారం చేయాలన్నారు. కాబట్టి ఇకపై మీ బూత్ లో మీరే బండి సంజయ్. మీరే ఇంటింటికీ తిరిగి అత్యధిక ప్రచారంతో గెలిపించాలని కోరారు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి యుడ్యూరప్ప ఎన్నికల సమయంలో తన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకేసారి వెళ్లి నామినేషన్ వేస్తారన్నారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తారన్నారు. పోలింగ్ బూత్ సభ్యులే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి యడ్యూరప్పను గెలిపిస్తారన్నారు. అందువల్లే యడ్యూరప్ప కర్నాటకలో 4సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. తెలంగాణలోనూ బండి సంజయ్ కు అత్యంత ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు.