హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ తీరాన ప్రపంచం మెచ్చేలా అద్భుతమైన పరిపాలనా సౌధాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరో ప్రతిష్టాత్మక కట్టడానికి సంకల్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి దగ్గరలోనే ‘ట్విన్ టవర్స్’ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. అమాత్యులు, కార్యదర్శులంతా కొత్త సచివాలయంలో ఎలాగైతే ఒకేచోట కొలువుదీరాలో.. అదే తరహాలో అన్ని శాఖల విభాగాధిపతులంతా (హెచ్‌వోడీలు) ఒకేచోట ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరింత మెరుగైన పరిపాలనకు దోహదపడే అంశాలపై సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ ప్రతిపాదనకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. సచివాలయం పూర్తిస్థాయిలో పని విధానంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయా ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలను ఒకేచోటకు చేర్చడం అవశ్యమని చెప్పారు. హెచ్‌వోడీ అధికారులకు సెక్రటేరియట్‌తో తరచుగా పని వుంటు-న్న నేపథ్యంలో వారి కార్యాలయా లను కూడా సెక్రటేరియట్ దగ్గర్లో సమీకృతంగా ఒకే చోట నిర్మించేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్‌వోడీలు వాటి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్విన్‌టవర్స్‌కు అందుబాటు-లో విశాలవంతమైన ప్రభుత్వం స్థలాలు ఎక్కడెక్కడున్నాయో ఈ సందర్భంగా సీఎం అడిగి తెలుసుకున్నారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్‌వోడీలన్నీ ఒకే చోట వుండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు- కేసీఆర్ తెలిపారు.
కుల వృత్తులకు దశలవారీగా ఆర్థిక సాయం..
కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బీసీ ఎంబీసీ కులాలు కుల వృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటు-ందని స్పష్టం చేశారు. వీరికి లక్ష రూపాయల చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి అమలు విధి విధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ- చైర్మన్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌కు వివరించారు. త్వరితగతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించాలని మంత్రి గంగులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అమరుల స్మారక జ్యోతి పనుల పరిశీలన
సమీక్షా సమావేశం అనంతరం అమరుల స్మారక జ్యోతి వద్దకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలిస్తూ కలియతిరిగారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు- చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తయి చివరిదశ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
స్మారక జ్యోతి ముందు తెలంగాణ తల్లి విగ్రహం
అమరుల స్మారక జ్యోతికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు- చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. విగ్రహానికి రెండువైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్‌అండ్‌బి ఇంజనీర్ శశిధర్‌ను ఆదేశించారు. దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా వుండే విధంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు- చేయాలని సూచించారు. అక్కడ నుంచి బిఆర్కే భవన్ వద్ద నిర్మించిన వంతెనల నిర్మాణాన్ని కేసీఆర్ పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ వంతెనలను నిర్మిస్తున్నారు.
దశాబ్ది ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను మరోసారి ఆదేశించారు. ఇటీ-వల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన తర్వాత ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతి గురించి డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ రెండు నుంచి రోజూ వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటు-న్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సీఎం కేసీఆర్‌కు వివరించారు.
కొత్త సచివాలయం ఆహ్లాదంపై సీఎం హర్షం
దేశం గర్వించేలా నిర్మించుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు ఎటు-వంటి ఆటంకాలు లేకుండా విధి నిర్వహణకు అనువుగా గొప్పగా నిర్మాణమయ్యిందని, అధికారులు సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభించుకుని నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో సచివాలయంలో మౌలిక వసతులు పూర్తవ్వడం గురించి, సౌకర్యాలు అందుబాటు-లోకి రావడం గురించి సీఎస్ శాంతకుమారిని సంబంధిత ఉన్నతాధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డితో పాటు- ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, సీఎం ఒఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఈఈ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.