హైదరాబాదు – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తోంది.
అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తోన్నారు. ఈ క్రమంలో మెగా కుటుంబంతో ఉన్న బాంధవ్యాలను పునరుద్ధరించుకుంటోన్నారు.
ఈ క్రమంలో- ఆ మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. కారును సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ మేనమామ ఇంటికి వెళ్లారు. భార్య స్నేహారెడ్డితో మెగా కాంపౌండ్‌లో గ్రాండ్‌గా అడుగు పెట్టారు. చాలాకాలం తరువాత ఇంటికి వచ్చిన తన మేనల్లుడిని చిరంజీవి, ఆయన భార్య సురేఖ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.ఆ సమయంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి దంపతులకు నమస్కరించారు.
ఎట్టకేలకు అల్లు అర్జున్.. మెగాస్టార్ ఇంటి గడప తొక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మెగా కాంపౌండ్‌తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో చాలాకాలం పాటు ఆయన చిరంజీవి కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే.
నాగబాబు ఇంటికి కూడా
ఇప్పుడు తాజాగా నాగబాబు ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. కొద్దిసేపటి కిందటే ఆయనను కలుసుకున్నారు. అల్లు అర్జున్ దంపతులకు ఎదురొచ్చి మరీ స్వాగతం పలికారు నాగబాబు, ఆయన భార్య పద్మజ. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పుష్ప 2- ది రూల్ సూపర్ హిట్ అయినందుకు అభినందించారు. రికార్డు స్థాయిలో ఆరు రోజుల్లోనే 1,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను వసూలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నాగబాబు ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో- ఏపీ మంత్రివర్గంలో బెర్త్ కన్‌ఫర్మ్ అయినందుకు నాగబాబును కూడా అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారని తెలుస్తోంది.కంగ్రాచ్యులేషన్స్ మామయ్యా అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని సమాచారం.