Wednesday, November 6, 2024

TS : 44 మంది ఐఏఎస్ ల బదిలీలు..

తెలంగాణ‌లో ఐఎఎస్ ల‌కు స్థాన చ‌ల‌నం ..

44 మంది ఐఎఎస్ లు బ‌దిలీ…
గ్రేట‌ర్ క‌మిష‌నర్ గా అమ్ర‌పాలి..
విద్యుత్ శాఖ కార్య‌దర్శిగా రోనాల్డ్ రోస్
జిఎడి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సుద‌ర్శ‌న్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ ల బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఈనెల 15వ తేదీనే అన్ని జిల్లాలకు కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది. 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీఓ జారీ చేసింది ప్రభుత్వం.

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ సుల్తానియాను నియమించగా, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్​కు అవకాశం కల్పించింది. సంజయ్‌ కుమార్‌కు కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.

యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించగా, చేనేత, హస్త కళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యను నియమించింది. హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అహ్మద్‌ నదీమ్‌ అటవీ, పర్యావరణ శాఖలతో పాటుగా టీపీటీఆర్‌ఐ డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

- Advertisement -

జ్యోతి బుద్ధప్రసాద్​కు హౌసింగ్‌, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవిని నియమించింది. రవాణా శాఖ కమిషనర్‌గా కె.ఇలంబరితి కొనసాగనున్నారు. విద్యుత్‌ శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్​కు జెన్‌కో, ట్రాన్స్‌కో అదనపు బాధ్యతలను అప్పగించింది.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి : శ్రీదేవసేనను కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్‌గా కొనసాగించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌, సెర్ప్‌ సీఈవోగా ఉన్న డి.దివ్యకు ప్రజావాణి నోడల్‌ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్.ప్రకాష్‌రెడ్డి పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా నియమించింది. ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్‌వర్షిణి, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్‌కు పురపాలక శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్‌గా కృష్ణా ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి ఎండీగా కె.అశోక్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా అనురాగ్‌ జయంతిని నియమించారు. ఐటీ ఉపకార్యదర్శిగా భవేష్‌ మిశ్రాను నియమించగా, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జి.రవికి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement