Tuesday, November 26, 2024

తెలంగాణ‌లో ఐఎఎస్ ల బ‌దీల‌లకు రంగం సిద్దం…ఏ క్ష‌ణంలోనైనా ఉత్త‌ర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో కార్యదర్శి, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకేశాఖలో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్లు సమాచారం. బదిలీలకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాలోచనలు జరిపినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడం, మరో పది మాసాల్లో అసెంబ్లి ఎన్నికలు జరుగుతుండడంతో బదిలీలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కొందరు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నాలుగైదు శాఖలకు ఇన్‌చార్జిలుగా పనిచేస్తుండడం, దీంతో వారిపై పనిభారం పెరిగిందన్న భావన ప్రభుత్వంలో ఉంది.

దీనికితోడు కీలకమైన కళాశాల, సాంకేతిక విద్య, ఇంటర్మీడియట్‌ విద్యా మండలికి కూడా కొత్త వారిని నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గతంలో ఈ పదవులు నిర్వహించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిత్తల్‌ను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడంతో ఆయా శాఖలను ఆయనే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతోపాటు ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం, ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలు తదితర అంశాలను పర్యవేక్షించాల్సి ఉన్నందున కొత్తవారిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దాదాపు 30మందిపై బదిలీ వేటు పడుతుందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. వడగళ్ల ప్రభావిత జిల్లాలు ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌లలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ రాగానే ప్రగతి భవన్‌లో ఈ బదిలీలకు సంబంధించిన కసరత్తుకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. సీనియర్‌ ఐఏఎస్‌లతోపాటు పది జిల్లాలకు కొత్త కలెక్టర్లను కూడా నియమిస్తారన్న ప్రచారం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్‌కుమార్‌ రిలీవ్‌ తర్వాత ప్రభుత్వ పాలనలో కీలకమైన అనేక పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సీఎస్‌ సోమేష్‌కుమార్‌ రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, గనుల శాఖ స్పెషల్‌ సీఎస్‌గా, ఇన్‌చార్జీ సీసీఎల్‌ఏగా కొనసాగారు. కీలక శాఖలతోపాటు రెరా చైర్మన్‌గా కూడా ఆయనే కీలక బాధ్యతలను నిర్వహించారు. రెరా చైర్మన్‌గా శాంతికుమారికి బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం పలువురు కలెక్టర్లకు స్థానచలనం కలిగించింది. ప్రభుత్వానికి తక్షణం క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకంగా వ్యవహరించే అధికారుల అవసరం నేపథ్యంలో విస్తృత కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర క్యాడర్‌లో 159 మంది ఉండగా 10మంది వరకు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. కీలకమైన సీసీఎల్‌ఏకు ఇన్‌చార్జిగా నవీన్‌మిత్తల్‌ వ్యవహరిస్తుండగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా పూర్తిస్థాయి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement