హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలను తాను ఎన్నటికీ మరువలేనని సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారీ మెజార్టీతో మూడోసారి ఎమ్మెల్యే గా గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో మూడోరోజు బుధవారం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో కలిసి శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సనత్ నగర్ లోని సెవెన్ టెంపుల్స్, సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్, పీజీ రోడ్డులోని హనుమాన్ టెంపుల్స్ కు చెందిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు శ్రీనివాస్ యాదవ్ ను వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, మీకు ఏ అవసరమొచ్చినా అన్నివేళలా అందుబాటులో ఉంటానని, తనను కలిసిన ప్రజలకు హామీ ఇచ్చారు. వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్, మేనేజర్లు, జీహెచ్ఎంసీ ఈఈ సుదర్శన్, డిప్యూటీ ఈఈ ఆంజనేయులు, నవీన్, ఎస్ఆర్ నగర్ సీఐ రాం ప్రసాద్, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ కమిటీ సభ్యులు బండారి సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో పలు కాలనీలకు చెందిన ప్రజలు, సిక్ వాడకు చెందిన టిల్లు, సనత్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, ఈఓ అన్నపూర్ణ ఆధ్వర్యంలో జెక్ కాలనీ మహిళలు, సుభాష్ నగర్ అధ్యక్షుడు బాలరాజు, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ చైర్మన్ సత్యనారాయణ, సభ్యులు జయరాజ్, హన్మంతరావు తదితరులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.