శంకర్‌పల్లి, (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఉన్న సమస్యలను పరిస్కరించడం లేదని, చాలాకాలంగా పెండింగ్‌లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు కాకుండా ఉంటే.. తాము ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తామని బీఆర్ ఎస్ ఎంపీటీసీ బద్దం సురేందర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మండలంలోని కొండకల్ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఆ విలేజ్ నుంచి దళిత బంధు, బీసీ బంధులో లబ్ధిదారులను ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీశారు.
ఇక.. 60 మందికి పెన్షన్ల కావాలని అడిగితే ఒక్కరికి కూడా మంజూరు చేయలేదని సురేందర్‌రెడ్డి ప్రశ్నించారు. రేడియల్ రోడ్డులో పాఠశాల భవనం ఉండడం కారణంగా దాన్ని కూల్చివేశామని, నూతన స్థలంలో పాఠశాల కోసం శంకుస్థాపన చేసి, పనులను మర్చిపోయారన్నారు. ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకొని కూలిపోయిందని, అయినా పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. ఇంతలా నిర్లక్ష్యం చేస్తే ఇంకా తానెందుకు పదవిలో ఉండాలని ఆయన ఆవేదన చెందారు. ఈ పనులన్నీ పూర్తయితేనే పదవిలో కొనసాగుతానని, లేకుంటే ఒక్క క్షణం కూడా పదవిలో ఉండబోనని అన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తమ పరిధిలోని గ్రామాలను పట్టించుకుని సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ప్రజలకు మేలుచేయలేని ఈ పదవి తనకెందుకు, రాజీనామా చేస్తానన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంచివాడే కానీ, ఆయనను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఇప్పటికైనా పరిస్థితులను సరి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, తదితరులు పాల్గొన్నారు