సిద్ధిపేట : ప్రజా పాలనలో ప్రజా ప్రతినిధినైనా తన కార్యాలయంపై దాడి చేయడం ఉన్మాదానికి పరాకాష్ట అని సిద్దిపేట ఎమ్మెల్యే ,మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు… కాంగ్రెస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకే రక్షణ లేకపోతే ప్రజలకేం రక్షణ ఇస్తారని రేవంత్ సర్కార్ ను నిలదీశారు.. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుత… సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్థరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టారని ఆరోపించారు.
ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది..
సిద్ధిపేటలో అర్థరాత్ర ఫ్లెక్సీ వార్ జరిగింది. అర్థరాత్రి హైడ్రామా నడిచింది. మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ సిద్ధిపేటలో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘రూ. 2 లక్షల రుణమాఫీ అయింది. నీ రాజీనామా ఎటు పాయె.. అబద్ధాల హరీశ్ రావు’ అంటూ సిద్ధిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ పేరిట పట్టణంలో ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
ఫ్లెక్సీలను తొలగించాలని బీజేఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో బీజేఆర్ చౌరస్తాలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆందోళనకు దిగాయి. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆందోళనలతో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో కొందరు హరీశ్ కార్యాలయంపై దాడి చేసి తలుపులను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు..