Tuesday, November 19, 2024

TS | ఆశించి కాదు, ఆలోచనతో చేశా.. అభినందన సభలో మంత్రి అజయ్

ఏదో ఆశించి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం కృషి చేయలేదని, వారి కండ్లలో ఆనందం చూడాలని, వారి దశాబ్దాల కల నెరవేర్చాలని పట్టుదలతో పనిచేసి 23 ఎకరాలు కేటాయించినట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దశాబ్ద కాలంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జర్నలిస్టుల ఇబ్బందులను అతి దగ్గర నుంచి చూశానని, వారి రెండు దశాబ్దాల కోరికను నెరవేర్చేందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు, మంత్రులు కేటిఆర్, హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో.. జెడ్పీ సమావేశ మందిరంలో మంత్రి అజయ్​కు కృతజ్ఞతా పూర్వక అభినందన సత్కార సభ జరిగింది.

నగర కమిటీ అధ్యక్షుడు మైసా పాపారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులు కనీస స్థలానికి నోచుకోకపోవడం ఇబ్బందిగా భావించానన్నారు. ఎలాగైనా నివాస స్థలాన్ని ఇప్పించాలని ఏడాది కాలంగా ప్రయత్నించానన్నారు. బిపిఎల్ కింద నివాస స్థలాలను కేటాయిస్తే కేవలం 70 గజాలు మాత్రమే వస్తుందని, అందుకనే దూరదృష్టితో కేసిఆర్ పేరిట సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

తొలి దశలో ఐదు ఎకరాలను కేటాయించామని ముఖ్యమంత్రి కేసిఆర్ ఖమ్మం బహిరంగ సభలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు మంత్రులు కేటిఆర్, హరీష్ రావు సహయ సహకరాలతో ఈనెల 18న కేబినెట్లో 23 ఎకరాల కేటాయింపుకు ఆమోదం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి, రెవెన్యూ ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా పూర్తి సహాయ సహకరాలను అందించారని తెలిపారు. కేసిఆర్ తన మంత్రి వర్గంలో తనకు స్థానం కల్పించడం వల్లే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చగలిగానని ఆయన తెలిపారు. ఇండ్ల స్థలాల కోసం మూడు దశాబ్దాలుగా టియుడబ్ల్యూజె (ఐజెయు) చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సుదా నిధుల నుంచి రెండు కోట్ల రూపాయలను జర్నలిస్టుల కాలనీకి కేటాయిస్తున్నామని కార్పోరేషన్ నుంచి మౌళిక వసతుల కల్పన జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement