మోత్కూర్, సెప్టెంబర్ 11 (ప్రభ న్యూస్) : తాను ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎమ్మెల్సీనయ్యానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, పాఠశాలల అభివృద్ధికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసినట్లు, ఆ దిశగా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.
బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ 14, 17 విభాగాల్లో నిర్వహిస్తున్న వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీలను ఆయన స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… తాను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఈ స్థాయికి ఎదిగానని, ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు.
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు లేకుండా చేయాలన్నదే తన తపన అని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తన స్వంత మండలమైన తుర్కపల్లిలో రూ.20 లక్షలతో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు, మోత్కూర్ ప్రాంత విద్యార్థులు రాష్ట్ర స్థాయికి వచ్చేలా క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు పోలీసు శాఖ, రెవెన్యూతో పాటు పలు శాఖల అధికారులతో గంజాయి, డ్రగ్స్, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ చట్టాలపై కనీస అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల హెచ్ ఎం గోపాల్ రెడ్డిని కోరారు.
ఇటీవల పారా ఒలింపిక్స్ లో వరంగల్ కి చెందిన క్రీడాకారిణి దీప్తి జివాంజి కాంస్య పథకం సాధించడంతో తాను స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు దీప్తికి రూ. కోటి నజరానా, గ్రూప్ 2 ఉద్యోగం, 500 గజాల స్థలం ఇప్పించానన్నారు. హెచ్ఎం తీపిరెడ్డి గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత, రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ డా లక్ష్మినర్సింహ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, గడ్డం నర్సింహా, సుదర్శన్, బయ్యని రాజు, తదితరులు పాల్గొన్నారు.