Monday, November 18, 2024

HYDRAA – పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో కలసి పనిచేయనున్న హైడ్రా

హైదరాబాద్: నగరంలో చెరువుల పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు హైడ్రా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. చెరువులు ఆక్రమణ, కాలుష్యానికి గురికాకుండా హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది..

వాటిని పరిరక్షిస్తూ పర్యావరణ హితంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా ముందడుగు వేసింది. ఈ మేరకు సోమవారం రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో పీసీబీ సెక్రటరీ రవితో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం అయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక చర్చలు జరిపి, వివిధ అంశాలపై కలిసి ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. పీసీబీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇరు విభాగాల అధికారులూ పాల్గొన్నారు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడడం, వరదనీరు, కాలువలు, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాల పరిరక్షణ వంటి హైడ్రా లక్ష్యాలను రంగనాథ్ సమావేశంలో ప్రస్తావించారు.

చెరువుల్లోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య కారకాలు చేరకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరుపక్షాలు చర్చించాయి. ముఖ్యంగా కాలువల్లో పారిశ్రామిక వ్యర్థాలు డంప్ చేయకుండా ఇరు విభాగాల అధికారులతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

చెరువులు, కాలువల్లో పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయా, లేదా? అనే విషయంలో ఆ నీటిని పరీక్షించాలని అధికారులు తీర్మానించారు. ఒకవేళ రసాయనాలు కలిస్తే అవి ఏ కంపెనీవో తెలుసుకునే వ్యవస్థనూ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తద్వారా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు రంగనాథ్, రవి భావిస్తున్నారు.

అలాగే పారిశ్రామిక వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి పీసీబీ నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించేలా అవగాహన కల్పించాలని తీర్మానించారు. ఆ తర్వాత కూడా వారు వ్యర్థాలను కాలువల్లో కలిపితే ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారు.

స్థానిక నివాసితులు, పర్యావరణ వేత్తలు, విద్యార్థులతో చెరువుల పరిరక్షణ కమిటీలు నియమించి, వారి భాగస్వామ్యంతో కాలుష్యానికి చెక్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నమోదైన కేసులు, ఫిర్యాదుల ఆధారంగా లోతుగా విచారించి నిందితులను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement