ప్రత్యేక విభాగం హైడ్రా!
జీహెచ్ఎంసీలో బాగం కాదు
27 మునిసిపాల్టీల పరిధిలో విధులు నిర్వహిస్తున్నాం
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ :
చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు హైడ్రా ధ్యేయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. అంతేకానీ, జీహెచ్ఎంసీలో హైడ్రా భాగం కాదని.. సెపరేట్ వింగ్ అని స్పష్టం చేశారు. తెలంగాణ వెదర్, క్లైమెట్ సర్వీసెస్‌పై శుక్రవారం జరిగిన స్టేక్ హోల్డర్స్ మీటింగ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మరో 27 మున్సిపాలిటీల పరిధిలోనూ హైడ్రా పనిచేస్తుందన్నారు. ఐఎండీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని ప్రకటించారు. హైడ్రాకు మొదటి కమిషనర్‌గా ఉండటం సంతోషంగా ఉందని రంగనాథ్ అన్నారు. దేశంలోనే మొదటి సారి హైడ్రా లాంటి వ్యవస్థను తెలంగాణలో తీసుకొచ్చామని తెలిపారు.
చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూద్దాం..
కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 27 మునిసిపాలిటీల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ అసెట్స్, లేక్స్ ఆక్రమణలకు గురవుతున్నాయన్నారు. వాటి పరి రక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని తేల్చి చెప్పారు. ఇదే సందర్బంగా ఈ సమావేశానికి హాజరైన అధికారుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుమరుగైన చెరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెరువులకు ఎల్డీఎల్, బఫర్ జోన్లను అధికారులు నిర్ణయించాలని కోరారు. ఇకపై చెరువులు అన్యాక్రాంతం కాకుండా అందరూ కలసికట్టుగా కృషి చేయాలని కోరారు.