ఈ నెల 27 వరకు బిడ్ లు స్వీకరణ
ఏడాది పాటు కొనసాగనున్న కాంట్రాక్ట్
కోమటికుంట చెరువులో హైరైజ్ నిర్మాణలపై హైడ్రా కన్ను
రెండు టాప్ టవర్లు కూల్చివేయాలని నిర్ణయం
హైదరాబాద్: కూల్చివేత వ్యర్థాలు తొలగించేందుకు హైడ్రా టెండర్లు పిలిచింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు బిడ్లు స్వీకరించనున్నారు. ఈమేరకు హైడ్రా అధికారులు ఆఫ్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా ఆ కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులు, నాళాలను పరిరక్షించడమే ధేయంగా ఏర్పాటైన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) దూకుడుగా వ్యవహరిస్తోంది.
హైరైజ్ నిర్మాణలపై హైడ్రా కన్ను
బాచుపల్లిలోని కోమటికుంట చెరువు (లేక్ ఐడీ నంబర్ 2822) ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమంగా 8, 9వ బ్లాక్ నిర్మాణ పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇటీవల సంబంధిత నిర్మాణ సంస్థ చేపడుతున్న స్థలాన్ని పరిశీలించారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలోనే 8,9వ బ్లాక్‌లు కడుతున్నట్టు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ సం స్థకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ బ్లాక్‌ల నిర్మాణం నిలిపివేయాలని ఆదేశించి నా ఆ సంస్థ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే లీగల్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా నిశితంగా పరిశీలన చేస్తున్నారు.. ఈ రెండు టవర్లను కూల్చివేయాలని నిర్ణయానికి వచ్చారు. అలాగే కూల్చే వేసే సమయంలో ఇతర కట్టడాలకు డామేజ్ జరగకుంగా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు.