Friday, November 22, 2024

HYDRAA – అమీన్‌ పూర్​లో హైడ్రా సర్వే – అదనపు అంతస్తులు నిర్మించిన భవనం కూల్చివేత ..

పెద్ద చెరువు ప‌రిస‌రాల్లో ఆక్రమణల వివరాలు సేకరణ
అనుమ‌తులకు మించి నిర్మించిన భ‌వ‌నం కూల్చివేత‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వ‌హిస్తున్నారు. హెచ్ఎంటీ, స్వర్ణపురి కాలనీలలోని సర్వే నెంబర్ 193, 194 & 323లలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి హైడ్రా సర్వే నిర్వ‌హిస్తోంది. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో రెండు రోజుల క్రితమే ప్రభుత్వ స్థలంలోని మూడు బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాటు 25 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగ‌తి విదిత‌మే.

అనుమ‌తులకు మించి నిర్మించిన భ‌వ‌నం కూల్చివేత‌
హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు అనుమతులకు మించి నిర్మించిన నాలుగు అంతస్తుల భవనాన్ని అమీన్ పూర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి పవన్ ఆధ్వర్యంలో కూల్చి వేతలు కొనసాగిస్తున్నారు. జీ+ 2 కోసం అనుమతులు తీసుకుని, అదనంగా రెండు అంతస్తులను నిర్మించడంతో నోటీసులు జారీ చేసి జేసీబీలతో కూల్చి వేస్తున్నట్లు టీపీఓ పవన్ తెలిపారు.

- Advertisement -

హైడ్రా బాధితుల‌కు బీఆర్ఎస్ అండ : కేటీఆర్‌
హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా తానుంటానని భ‌రోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టామని, హైడ్రా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూకట్ పల్లి నియోజక వర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ అని, జీహెచ్ఎంసీ, బుద్ద భవన్ లు కూడా నాళాల పైనే ఉన్నాయని అన్నారు. మంత్రుల ఇళ్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నాయని, వాటిని కూల్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement