Wednesday, September 18, 2024

HYDRAA – త్వరలో “హైడ్రా” కు ప్రత్యేక చట్టం : రంగనాథ్

హైద‌రాబాద్ – త్వరలో హైడ్రా పేరిట ప్రత్యేక చట్టం రూపొందించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. అమల్లోకి వచ్చాక త్వరలోనే హైడ్రా పేరిట స్వయంగా నోటీసులు ఇస్తామన్నారు. హైడ్రా పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు తమ విచారణలో తేలిన అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించిన వారి గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని రాష్ట్ర ప్రభుత్వం జులై 19న ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలోని చెరువుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ, క్రీడా మైదానాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటివి హైడ్రా బాధ్యతలు. చెరువుల FTLలో, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా కూల్చేస్తోంది.

- Advertisement -

హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయానికి మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో ఫిర్యాదు దారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు క్యూ కడుతున్నారు. దీంతో హైడ్రా కార్యాలయానికి రోజు రోజుకీ తాకిడి పెరుగుతోంది. మొదట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు.. హైడ్రా కఠిన చర్యలతో వందల్లోకి చేరాయి. వాటన్నింటినీ స్వీకరిస్తున్న కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement