హైదరాబాద్ – ఆంధ్రప్రభ : శంషాబాద్ లో చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. చారినగర్ లో కబ్జాలకు గురైన గొల్లవానికుంట, ధర్మోజికుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సుమారు 23 ఎకరాలు ఉండాల్సిన చెరువు పూర్తిగా కనిపించకుండా పోయిందని, ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదని ఇరిగేషన్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పరిశీలించి కబ్జాకు గురైన కుంటలను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నోటీసులు జారీ చేసి ఆక్రమణల తొలగింపు
ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ … కబ్జా చేసిన వ్యక్తులకు వెంటనే నోటీసులు అందజేసి అక్రమాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు రోజుల్లో తిరిగి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తానని తెలిపారు. ధరణి పోర్టల్ లో శంషాబాద్ విలేజ్ పేరు లేకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఈ అంశాన్ని పరిశీలిస్తానని తెలిపారు. పూర్తిగా కబ్జాలకు గురైయ్యేంత వరకు అధికారులు తిరిగి చూడకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన చర్యలు తీసుకోకపోతే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.