ఆంధ్రప్రభ స్మార్ట్, పటాన్‌చెరు (సంగారెడ్డి) : అమీన్‌పూర్ పెద్దచెరువు ముంపు బాధితులకు హైడ్రా అండగా ఉంటుందని కమిషనర్ రంగనాథ్ భరోసా ఇచ్చారు. మంగళవారం అమీన్‌పూర్ పెద్ద చెరువును ఆయన పరిశీలించారు. అక్కడ ముంపు బాధితులు ఫిర్యాదులు, వినతుల మేరకు ఆయన సందర్శించారు. తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు లోని నీరు తూముల ద్వారా కిందకు వదలకపోవడంతో ఎగువున వున్న తమ నివాసాలు మునిగిపోయాయి అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి స్థానికులు తీసుకు వెళ్లారు.
నిపుణల కమిటీ వేస్తా…
చెరువు లోని నీరు తూముల ద్వారా కిందకు వదలకపోవడంతో ఎగువున వున్న తమ నివాసాలు మునిగిపోయాయి అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి ఫిర్యాదు చేశారు. ఇందుకు ఆయన స్పందిస్తూ నిపుణుల కమిటీ వేసి నివేదిక తెప్పించుకుని ప్రభుత్వానికి సమర్పిస్తామన్నతెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ చర్యలు తీసుకుంటామన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాటసాని అక్రమ కట్టడాలపై ఆరా
మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు అరా తీశారు. మున్సిపాలిటీ పరిధిలో ఆయనకు చెందిన 20 ఎకరాల భూములపై దృష్టి సారించారు. దీనిపై హైడ్రా విచారణ చేపట్టనుంది.
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
వారం రోజుల కింద పటాన్‌చెరు, అమీన్ పూర్ పర్యటించిన నేపథ్యంలో అక్రమాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టారు. విచారణ చేపట్టిన అనంతరం అక్రమ నిర్మాణాలపై కొరడా ఝూళిపించారు. చెరువులు, కుంటలు నాళాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా కూల్చి వేస్తుందన్న భయంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ తమ వంతు వస్తుందోనన్న భయంతో అక్రమార్కులకు భయపడుతున్నారు. హైడ్రా అధికారులు విచారణ జరిపిన అనంతరం నోటీసులు అందించి అనంతరం కూల్చివేతలకు చర్యలు తీసుకుంటున్నారు.