హైడ్రాకు గ్రహణం.. నిప్పుకు చెదంటే ఇదే
కుట్రలు, కుతంత్రాలు.. బ్యూరోక్రాట్ల మధ్య ఆధిపత్య వార్
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు.. ఏకమైన వివిధ వర్గాలు
తోడైన సోషల్ మీడియా.. హైడ్రాని బద్నాం చేసే యత్నం
న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జ్, ఆంధ్రప్రభ
ఒక మంచి కార్యక్రమం సమన్వయ లోపం, స్వార్ధపూరిత ప్రయోజనాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఎలా నీరుకారిపోయే ప్రమాదం ఉందో చెప్పడానికి తాజా ఉదాహరణ హైడ్రా!.. కోటి రత్నాల వీణ తెలంగాణలో నీటి వనరులను పరిరక్షించడానికి, తద్వారా సహజసిద్ధమైన చెరువులను కాపాడి పర్యావరణ హితంగా రాష్ట్రాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదాత్త ఆశయంతో హైడ్రా వ్యవస్థను రూపొందించింది. తగిన యంత్రాంగాన్ని సమకూర్చి ఆక్రమణలను తొలగించడానికి ఉపక్రమించింది. అక్రమార్కులు నిర్మించిన పలు భవంతులనే కాకుండా వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్న అనేక షెడ్లు, కట్టడాలను ఇప్పటికే తొలగించింది. అయితే, వీటిలో ఎక్కడా నివాస గృహాలు లేవు. అప్పటికే నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న భవనాలను, ఇతర కట్టడాలను మాత్రమే హైడ్రా కూల్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అనుకూల వాతావరణం ఏర్పడింది. తమకూ ఇటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని తెలంగాణలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో కూడా డిమాండ్లు వెల్లువెత్తాయి. పర్యావరణ హిత సామాజికవాదులు, పలువురు మేధావి వర్గాల వారు తమ సంపూర్ణ మద్దతుతో హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.
పరపతి పోతోందనే ఈర్ష్యా..
సరిగ్గా ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. అక్రమార్కులతో పాటు హైడ్రా వ్యవస్థతో నష్టపోతున్న, తమ పరపతి తగ్గిపోతోందని ఈర్ష్యా అసూయతో రగిలిపోయిన కొన్ని వ్యవస్థల ఉన్నతాధికారులు ఒక్కటయ్యారు. అంతే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు తయారైంది హైడ్రా పరిస్థితి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హైడ్రాకు నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారికి వస్తున్న మంచి పేరు కొన్ని ఇతర వ్యవస్థల ఐఏఎస్, ఇతర బ్యూరోక్రాట్లకు కంటగింపుగా మారిందని సామాజిక పరిశీలకులు భావిస్తున్నారు. సహజంగానే ఐఏఎస్, ఐపీఎస్‌ల మధ్య కంటికి కనిపించని ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుందన్నది వారి వాదన. హైడ్రా వ్యవహారంతో అది మరోమారు తెరపైకి వచ్చిందని వారి విశ్లేషణ. అయితే, అందరు ఐఏఎస్‌లు లేదా ఐపీఎస్‌లు ఈవాదనను అంత తేలిగ్గా అంగీకరించకపోవచ్చు! వారిలో అత్యధికులు సమాజహితం కోసం ఎంతైనా పాటుపడుతున్న వారే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, కడివెడు పాలలో చిటెకెడు ఉప్పు చాలన్నట్టు ప్రస్తుత వ్యవస్థలో లొసుగులు మొత్తం ప్రభుత్వ లక్ష్యాలనే నీరుగార్చేస్తున్నాయని మేధావి వర్గాలు కూడా అంటున్నాయి.
కుట్రలు, కుతంత్రాలు..
ఇప్పుడీ వ్యవహారంలో హైడ్రాకు అనేక అడ్డంకులు సృష్టించబడ్డాయని సమాజ హితైషులు వాపోతున్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత పెద్దగా పట్టించుకోని పైన చెప్పుకున్న కొందరు బ్యూరోక్రాట్లు, అక్రమార్కులకు మితిమీరిన దాహంతో పాటు ఎడాపెడా మేతమేస్తున్న ఆయా వ్యవస్థల్లోని మధ్య, కింది స్థాయి ఉద్యోగులు జత కలిశారు. కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాయి. అసలు హైడ్రా వ్యవస్థలోనే లేని నోటీసుల అంశాన్ని పాశుపతాస్త్రంగా ప్రయోగించారు. నోటీసులు ఇచ్చే అధికారం కాని, వ్యవస్థ కాని లేని హైడ్రాకు తలనెప్పిగా దీన్ని మార్చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఆపరేషన్ మూసీ అంశాన్ని ఆరంభించింది. ఇది కూడా భాగ్యనగరంతో పాటు రాష్ట్ర బంగారు భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందనే ముఖ్య ఉద్దేశంతోనే ప్రభుత్వం చేపట్టింది. కుట్రలు, కుతంత్రాల్లో ఆరితేరిన ఆయా బ్యూరోక్రాట్లు, అక్రమార్కులు, కొసరు ఆదాయమే ఊపిరిగా బతుకుతున్న మధ్య, కిందిస్థాయి అధికారులు ఆయా వ్యవస్థల నుంచి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలోని కొన్ని వర్గాలు ఎడాపెడా నోటీసులు జారీ చేసి, అదంతా హైడ్రా మీదకు నెట్టేశారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొందరు దీనికి రాజకీయ రంగు కూడా పులిమేశారు. అంతే… ఎప్పుడు ఏది తెరపైకి వస్తే దాన్ని విపరీతంగా ట్రోలింగ్ చేసే సోషల్ మీడియా రచ్చ రచ్చ చేసేసింది.
అందులో భాగంగానే విమర్శలు..
ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇదే సమయంలో వెలువడిన న్యాయవ్యవస్థ వ్యాఖ్యానాలు కూడా హైడ్రాకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టాయంటున్నారు. చట్టప్రకారమే వ్యవహరిస్తున్నప్పటికీ, జరుగుతున్న వ్యవహారాలన్నీ హైడ్రాకు ఆపాదించడంతో కనిపిస్తున్న ఆధారాలపైనే న్యాయవ్యవస్థ కూడా స్పందిస్తుంది. న్యాయవ్యవస్థపై అపార గౌరవంతో ఉన్న సభ్య సమాజం ఇప్పుడు ఆలోచనలోపడింది. హైడ్రా నిజంగానే దూకుడుతో వ్యవహరిస్తోందని భావిస్తోంది. అక్రమంగానే ఆయా నిర్మాణాలను కూల్చి వేస్తోందని నమ్మే పరిస్థితికి వచ్చేసింది. పైగా బడాబాబులకు నోటీసులు ఇస్తూ, పేద, మధ్య తరగతికి చెందిన సామాన్యుల ఇళ్లనే కూల్చివేస్తున్నారన్న రాజకీయ విమర్శలు కూడా ఇందుకు తోడయ్యాయి. ఈ నేపథ్యంలో హైడ్రా భవిష్యత్పైనే నీలినీడలు వ్యాపించాయి.
వ్యవస్థలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం..
ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేపట్టడం, తగిన వ్యవస్థలను రూపొందించడం, సమర్ధ అధికారులను నియమించడమే కాదు, ఆయా వ్యవస్థలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కూడా చూడాల్సిన బాధ్యత ఉందని దీంతో మరోసారి తేలిపోయిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇందుకు సంబంధించి మరింత స్పష్టమైన, సవివరణలతో అన్ని వర్గాల ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. అలాగే, ఏదైనా ఒక కార్యక్రమం రూపొందించినప్పుడు ఎవరిదారిన వారు వ్యవహరించకుండా సమష్టిగా ఎలా ముందుకు పోవాలన్న అంశాలపై ముందుగానే కార్యాచరణ రూపొందించుకోవాలని, ఇందుకు ప్రభుత్వమే పూనుకుని అన్ని వ్యవస్థల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలను తరచూ నిర్వహిస్తూ లోపాలను సరిదిద్దుకుంటే, హైడ్రా వంటి ఉన్నత స్థాయి వ్యవస్థలతో మహోన్నత కార్యక్రమాలను మరింత సమర్ధంగా అమలు చేయవచ్చునని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఆయా కార్యక్రమాలను చేపట్టే ముందుగానే అందుకు సంబంధించి పబ్లిక్ ఎవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టాలని కూడా అంటున్నారు.