Friday, November 22, 2024

Criminal cases – హైడ్రా సంచలనం – అధికారులపై కేసులు నమోదుకు నిర్ణయం

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్‌ కేసులకు సిద్ధమైంది.

- Advertisement -

ఆరుగురు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్‌ కమిషనర్‌కు హైడ్రా సిఫారసు చేసింది. హెచ్‌ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

.అధికారులకు హైడ్రా సెగ..

అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకూ హైడ్రా సెగ తగిలింది. చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా పెద్దఎత్తున కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో చిన్నా పెద్దవి కలిపి సుమారు 200కి పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారుల సమాచారం. 50 ఎకరాల వరకు ప్రభుత్వ, చెరువుల భూములను పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

. ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.పలుచోట్ల చాలామంది చెరువులను ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టిన విషయం ప్రభుత్వానికి తెలియంది కాదు. పర్యవేక్షణ అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలు నిబంధనల మేరకు జరుగుతున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేయాల్సి ఉంటుంది.

అనుమతులు లేని పక్షంలో కూల్చివేతలు చేపట్టాలి. పర్యవేక్షణ అధికారులే కాదు ప్రతి విభాగంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు కూడా నిర్మాణాలపై ఓ కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో సర్వే నంబర్లు వేరుగా వేసి నిర్మాణ అనుమతులు తీసుకున్నట్లు కూడా హైడ్రా అధికారులు గుర్తించారు.

అనుమతులు జారీచేసే ముందు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. అలాచేస్తే సర్వే నంబరు సరైనదా? కాదా? గుర్తించడం అధికారులకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈ మేరకు అక్రమ నిర్మాణాలకు సంబంధించి.. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించడంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలను అమలు చేయని అధికారుల లెక్కలు తేల్చాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement