హైదరాబాద్ – అబిడ్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసు కున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జాగ్రత్తలు పాటిద్దాం..దీపావళిని సురక్షితంగా జరుపుకుందాం అని ఆయన ఈ సందర్భంగా సూచించారు. హైదరాబాద్ నగరంలోని పలు టపాసుల దుకాణ సముదాయల వద్ద హైడ్రా బృందాలు భద్రతపై అవగాహన కల్పించనుందని తెలిపారు.
అబిడ్స్ క్రాకర్స్ షాప్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో హైడ్రా అప్రమత్తం అయ్యిందన్నారు.
బాణాసంచా గోదాంల రక్షణకు మార్గదర్శకాలు..డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు పటాకుల దుకాణాల యజమానులు, కస్టమర్లకు పలు జాగ్రత్తలు తెలియజేస్తున్నారన్నారు. బాణసంచా గోదాంలతో పాటు.. వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు తెలియజేశారన్నారు. అగ్నిమాపక పరికరాలను ఉపయోగించడం.. అత్యవసర పరిస్థితుల్లో మంటలను ఆర్పే సాధనాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలనే విషయాలను తెలిపారు. ఎమర్జెన్సీ ఎస్కేప్ ప్లాన్లు.. తప్పించుకునే మార్గాలు, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలనే విషయాలపై డీఆర్ఎఫ్ బృందాలు అవగాహన కల్పించారు.