హైదరాబాద్: జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యనిర్వాహక తీర్మానంతోనే సంస్థ ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. హైడ్రా చట్టబద్ధతపై ప్రభుత్వం పని చేస్తున్నదని, వచ్చే నెల రోజుల్లోగా అందుకు సంబంధించి పూర్తి విధివిధానాతో ఆర్డినెన్స్ విడుదల చేస్తారని తెలిపారు.
హైడ్రాకు త్వరలోనే విశేష అధికారాలతో పాటు ఆరు వారాల తరువాత అసెంబ్లీ ‘హైడ్రా’ బిల్లు రాబోతోందని పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపాలిటీలు, నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. గ్రే హౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో తాము పని చేస్తామని రంగనాథ్ వెల్లడించారు. చెరువుల పరిరక్షణ ధ్యేయంతోనే తమ పని విధానం ఉంటుందని ఆయన వెల్లడించారు.. కొత్తగా ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు కొనుగోలు చేసేవారు డాక్యుమెంట్ లు పూర్తిగా పరిశీలించుకోవాలని కోరారు.. అనుమానాలు ఉంటే సంబంధిత కార్యాలయాంలో వివరాలు తెలుసుకోవాలని సూచించారు..