నేటి ఉదయం నుంచే కూల్చివేతలు షురూ
54 ఏకరాల చెరువులో 12 ఎకరాలు కబ్జా
కూల్చివేత అనంతరం నాలుగెకరాల స్థలం స్వాధీనం
ఆక్రమణదారులందరికీ నోటీసులు
గడువులోగా వెళ్లకపోతే కూల్చివేస్తామని వార్నింగ్
హైదరాబాద్ – ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో ఆక్రమణలపై హైడ్రా పంజా పడింది.. నేడు ఈ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్‌లోని 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను హైడ్రా కూల్చివేసింది. ఇక్కడ ఇది ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ ప్రభుత్వ స్థలంలో ఉన్న ఉన్న వైన్స్‌ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశించారు. కూల్చివేతల సందర్భంగా అధికారులకు భారీ బందోబస్తు చేపట్టారు.
ముందుగా తనికీ చేసిన హైడ్రా చీఫ్ ..
ఇటీవల భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భగీరథమ్మ చెరువు నానక్‌రామ్ గూడా సర్వే నంబర్ 150, 151.. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ సర్వే నంబర్ 450, 451లో దాదాపుగా 54 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ రెండు మండాలల పరిధిలోని నానక్‌రామ్ గూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ గ్రామాల్లో చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ విస్తరించింది. 2013లో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించిన హద్దుల ప్రకారం.. ఈ చెరువు మొత్తం 54 ఎకరాల్లో ఉంది. 2013లో 48 ఎకరాల మేర నీరు ఉందని ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ అధికారులు మ్యాప్ తయారు చేశారు. గత కొంత కాలంగా కబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. చెరువును ఎండబెట్టి మరీ స్థలాన్ని కబ్జా చేశారని గుర్తించారు.. మొత్తం 12 ఏకరాలు ఈ చెరువు ఆక్రమణకు గురైందని హైడ్రా నిర్ధారించింది.. దీంతో తక్షణం ఆక్రమణలు తొలగించాలని హైడ్రా చీఫ్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ నిర్మాణదారులకు ఇప్పటికే నోటీస్ లు జారీ చేసిన అధికారులు ముందుగా చెరువు చుట్టు ఆక్రమిత స్థలంలో వేసిన ఫెన్సింగ్ ను తొలగించారు.. అలాగే కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు.. మిగిలిన వారికి సమయం ఇచ్చారు.. ఆ లోగా ఆక్రమణలు తొలగించకుంటే కూల్చివేస్తామని వారికి స్పష్టం చేశారు.