హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించినట్టు తేల్చి చెప్పారు.. అలాగే, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తామని కామెంట్స్ చేశారు.
నేడు జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..’హైదరాబాద్ లేక్ సిటీ. గండిపేట, ఉస్మాన్ సాగర్.. హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. డ్రైనేజీలను చెరువుల్లో కలుపుతున్నారు. ఆ ఫాం హౌస్‌ల నాలాలు గండిపేటలో కలిపారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం.అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి.
ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తాం. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు.
ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండొచ్చు. కానీ, నేను ఎవరినీ పట్టించుకోను. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. భవిష్యత్ తరాలకు ప్రకృతిని అందించాలి’ అంటూ కామెంట్స్ చేశారు.