ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా పేరు భాగా వినిపిస్తోంది. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నాలాలు, కుంటలు, చెరువులు ఆక్రమించి ఎప్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు నిర్దాక్షిణంగా కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కూల్చివేతలు జోరుగా సాగుతుండగా..ఇతర జిల్లాల్లో కూడా హైడ్రా తరహా కూల్చివేతలు మొదలయ్యాయి.
సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు అనే తేడా లేకుండా, ఆక్రమణ రుజువైతే కట్టడాలను కూల్చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు నేతలు హైడ్రాకు పూర్తి మద్దతు ఇస్తుంటే.. మరికొందరు మాత్రం కన్నెర్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్‌లో ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న పేదళ ఇళ్లను కూల్చివేయడంపై ఎంపీ డీకే అరుణ అయ్యారు.
మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. ఆయా రాష్ట్రాలకు ఫండింగ్ కోసమే కూల్చివేతలు సాగుతున్నాయని విమర్శించారు. కలెక్షన్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఆరు గ్యారెంటీలపై విపక్షాలు, ప్రజలను డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ స్థలంలో నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తే ఇప్పుడు కూల్చడం ఏంటని ఆమె ప్రశ్నించారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.