- నీరు కలుషితమవుతున్నదన్న ఫిర్యాదుతో కదిలిన హైడ్రా
- స్థానికుల నుంచి వివరాల సేకరణ
- ఎర్రకుంట చెరువును పరిశీలించిన రంగనాథ్
- ఇప్పటికే తెలంగాణలో 61శాతం చెరువుల మాయం
- మిగిలినవైనా కాపాడుకుందాం అంటూ హైడ్రా చీఫ్ పిలుపు
హైదరాబాద్ – గ్రేటర్ పరిధిలోని చెరువుల పరిరక్షణపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టిన క్రమంలో హైదరాబాద్ సిటీలో వీలైనప్పుడల్లా ఆక్రమణలకు గురైన చెరువులను పరిశీలిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాధ్. దీనిలో భాగంగా ఇవాళ మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తుర్కచెరువును సందర్శించారు. తుర్క చెరువులో ఆక్రమణలతో పాటు కలిషిత నీరు కలుస్తుందన్న ఫిర్యాదుతో చెరువును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు రంగనాథ్. అనంతరం స్థానికుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు.. ఆ తర్వాత బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువులో గతంలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టుగా అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.
61శాతం చెరువులు కనుమరుగు…
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… గ్రేటర్ సిటీ పరిధిలోని చెరువులు 61శాతం కనుమరుగయ్యాయని చెప్పారు. మిగిలిన 39శాతం చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణలో అతివేగంగా పట్టణీకరణ జరుగుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణలో 47శాతం పట్టణీకరణ జరిగిందని, 2050 నాటికి 75శాతానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో చెరువులను కాపాడుకోలేకపోతే మరో 15 ఏండ్లకు సిటీలో చెరువులు మిగలవని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా వచ్చాక జనం ఎన్టీఎల్, బఫర్, ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకుని ఆస్తులు కొంటున్నారన్నారు రంగనాథ్.