15నుంచి 18 వరకు మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేయనున్న షర్మిల
కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన ఇందిరాశోభన్, పిట్టా రాంరెడ్డి
హైదరాబాద్, : నిరుద్యోగ యువతకు భరోసాగా.. వెయస్ షర్మిల ఈ నెల 15నుంచి నిర్వహించతలపెట్టిన 72గంటల నిరాహారదీక్షకు అనుమతి కోరుతూ..షర్మిల అనుచరులు ఇందిరా శోభన్, పిట్టా రాంరెడ్డిలు సెంట్రల్ జోన్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్‌కు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వాలని, పీఆర్సీ నివేదిక ప్రకారం లక్షా 91వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో వైయస్ షర్మిల 72గంటల నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో అనుమతి కోసం ఆమె అనుచరులు కమిషర్‌కు వినతి పత్రం అందించారు. అయితే వినతిని పరిశీలించిన కమిషనర్ పై అధికారులతో చర్చిస్తామని చెప్పారని షర్మిల అనుచరులు చెప్పారు. ఈ నెల 15న ఉదయం 10 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 11గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా, కోవిడ్ నిబంధనలకు లోబడి దీక్ష చేస్తామని..లేఖలో పేర్కొన్నారు.
దీక్షకు పలువురి మద్ధతు కోరనున్న షర్మిల పార్టీ..
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో షర్మిల చేపట్టబోతున్న 72గంటల నిరాహారదీక్షకు మద్ధతు కోసం పలువురు మద్ధతు కోరనున్నట్టు తెలుస్తోంది. దీక్షకు అనుమతి వచ్చిన వెంటనే ఉద్యమకారులతో పాటు ప్రొఫెసర్లకు ఆహ్వానం అందివ్వనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ప్రొఫెసర్ కోదండరామ్, హరగోపాల్, బిసి నేత ఆర్ కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ, ప్రజా యుద్ధ నౌక గద్ధర్‌తో పాటు చుక్కా రామయ్యకు ఆహ్వనం ఇవ్వనున్నారని సమాచారం. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వెళ్తున్న షర్మిల.. పార్టీ ఏర్పాటు కంటే ముందే ప్రభుత్వంపై పోరాటానికి దిగుతుండడం పట్ల రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం సభకు..ఇచ్చినట్టే..షర్మిల దీక్షకూ అనుమతివ్వాలి.. షర్మిల చేపట్టబోయే నిరాహారదీక్షలకు అనుమతిపై పోలీసులు కోవిడ్‌ను కారణంగా చూపుతున్నట్టు అర్ధమవుతుందని, ఒకవేళ కోవిడ్ కారణమైతే..సాగర్‌లో సీఎం సభకు అనుమతి ఎలా ఉంది అంటూ షర్మిల అనుచరురాలు ఇందిరాశోభన్ ప్రశ్నిస్తున్నారు. కాగా సీఎం సభకు అనుమతి ఎలా ఉందో..షర్మిల దీక్షలకు అనుమతి అదే విధంగా ఇవ్వాలని పోలీసులను కోరారు.