Sunday, November 24, 2024

TS | డ్రగ్స్‌పై పోరులో యువత చురుకుగా ఉండాలి : సందీప్ శాండిల్య

మల్కాజ్గిరి, (ప్రభ న్యూస్): డ్రగ్స్‌పై పోరాటంలో యువత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలని ఐపీఎస్ ఆఫీసర్ సందీప్ శాండిల్య అన్నారు. ఇవ్వాల (శనివారం) రాత్రి హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో రాచకొండ భద్రతా మండలి, రాచకొండ పోలీస్ కమిషనరేట్ సహకారంతో మత్తు పదార్థాల దుర్వినియోగం, నిరోధక సదస్సు‌‌–2024ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ పై అవగాహన కల్పించే మార్గదర్శకాల పోస్టర్‌లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్‌ఎన్‌ఏబీ) డైరెక్టర్.. ఐపీఎస్ ఆఫీసర్ సందీప్ శాండిల్య మాట్లాడారు. డ్రగ్స్ వినియోగం సమాజంపై, ముఖ్యంగా యువతపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతోందో వివరించారు. డ్రగ్స్, ఇతర నిషేధిత సైకోట్రోపిక్ పదార్థాలు వాడడం ద్వారా తెలివైన విద్యార్థులు తమ విద్యతోపాటు భవిష్యత్తును ఎలా పాడు చేసుకుంటున్నారో తెలిపారు.

అన్ని రకాల మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డ్రగ్స్ పై పోరును సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ లక్ష్యాన్ని సాధించే సామాజిక ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుప్రసంగిస్తూ.. విద్యార్థులు తమ జీవితంలో ఒక్కసారి కూడా డ్రగ్స్ ని ఉపయోగించవద్దని కోరారు. అన్ని కళాశాలలు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ అవినాష్‌ మహంతి మాట్లాడుతూ.. డ్రగ్స్‌ అలవాటు చాలా దారుణమని, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఎంతో మంది అధికారులు, ఇతర విజయవంతమైన వ్యక్తులు తమ జీవితంలో ఏదైనా సాధించడానికి అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారనే విషయాన్ని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement