Friday, November 22, 2024

2025 లోపు క్ష‌య‌వ్యాధిలేని తెలంగాణగా మారుద్దాం – ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

‌హైద‌రాబాద్‌, 2025 లోపు క్ష‌య వ్యాధి లేని రాష్ట్రంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దుదామ‌ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అన్నారు. బుధ‌వారం వ‌ర‌ల్డ్ టీబీ డే (ప్ర‌పంచ క్షయ‌వ్యాధి దినం) ను పుర‌స్క‌రించుకుని ఎల్బీన‌గ‌ర్, బైరామ‌ల్‌గూడ‌లోని అవేర్ గ్లెనిగ‌ల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో3కె వాక్‌థాన్‌ అవగాహన ర్యాలీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముందుగా ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. పూర్వం రోజుల్లో టీబీ అంటేనే చాలా భ‌యంక‌ర‌మైన అంటువ్యాధిగా ఉండేద‌ని, ఊరినుంచి వెలేయ‌డ‌మో, ఊరి బ‌య‌ట ఉంచే ప‌రిస్థితులు ఉండేవ‌న్నారు. ఇటీవల వ‌చ్చిన క‌రోనా వ‌లె జ‌నం ఎక్కువగా భ‌య‌ప‌డేవార‌న్నారు. క్రమంగా సైంటిస్టుల, డాక్ట‌ర్ల కృషితో మంచి మందులు, చికిత్స అందుబాటులోకి రావ‌డంతో క్ర‌మంగా సాధార‌ణంగా జ‌బ్బుగానే ప‌రిగ‌ణిస్తున్నార‌న్నారు. దేశమంతా పోలియో నివారణ చేసినట్లుగానే క్షయ వ్యాధిని నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని ఎమ్మెల్యే వివరించారు. రాష్ట్రంలో క్షయ వ్యాధి కాకుండా ఇతర వ్యాధుల పట్ల వైద్యారోగ్య‌శాఖ చేపట్టిన విధులు, ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌తో ఎన్నో వ్యాధులను నిర్మూలించేలా చొరవ చూపామని, ఇప్పుడు అదే తరహాలో క్ష‌య నివార‌ణ‌కు ప్ర‌తిఒక్క‌రూ కృషి చేయాల‌ని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
అవేర్ గ్లెనిగ‌ల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి క‌న్స‌ల్టెంట్ ప‌ల్మ‌నాల‌జిస్ట్ & స్లీప్ ‌మెడిసిన్ డాక్ట‌ర్ సుధీర్‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ప్ర‌పంచంలోని మూడో వంతు క్ష‌య‌వ్యాధి రోగులు మ‌న‌దేశంలోనే ఉన్నార‌ని అన్నారు. టీబీ వ్యాధిపై అవ‌గాహ‌న పెంచుకుంటే స‌మూలంగా నివారించ‌వ‌చ్చని ఆయ‌న సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో లింగోజిగూడ డివిజ‌న్ మాజీ కార్పొరేట్ శ్రీనివాస‌రావు, అవేర్ గ్లెనిగ‌ల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి సీసీవోవో డాక్ట‌ర్ మెర్విన్ లియో, అవేర్ గ్లెనిగ‌ల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి మెడిక‌ల్ హెడ్ డాక్ట‌ర్ సుకేశ్‌‌కుమార్‌, అవేర్ గ్లెనిగ‌ల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి ఆప‌రేష‌న్స్ హెడ్ డాక్ట‌ర్ ఇసాక్ సౌమిల్, ఆస్ప‌త్రి వైద్య‌సిబ్బంది త‌దిత‌‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement