Saturday, November 23, 2024

మినీ పోరుకి వారంలో నోటిఫికేష‌న్….

హైదరాబాద్‌, : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ఫలితాలకు ముందే వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మరో ఐదు పురపాలక సంఘాలకు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీకి సిద్ధమైంది. ఈ నెల 17న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసి ఈనెల 30లోగా పురపాలికలకు పాలక మండళ్ల ఎలక్షన్లను పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు వేగం పెంచిన ఎస్‌ఈసీ నేడు తుది ఓటర్ల జాబితా ప్రదర్శించనుంది. ఇప్పటికే రిటర్నింగ్‌ అధికారులు
సహాయ రిటర్నింగ్‌ అధికారుల జాబితా సిద్ధం చేసి శిక్షణ కూడా పూర్తి చేసింది. ఈనెల 14న పోలింగ్‌ కేంద్రాల తుది గుర్తింపు జాబితా వెల్లడి కానుంది. మేజర్‌ కార్యాచరణ పూర్తవడంతో మినీ పోరుకు వచ్చే వారంలో ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు ఓట్ల లెక్కింపు వచ్చే నెల 2న జరగనుంది. ఈలోగా పురపాలక, కొన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తిచేయాలని ఈసీ భావిస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు శరవేగంగా జరుగుతోంది. ఈ ఎన్నికలకు మునిసిపల్‌ శాఖ డైరెక్టర్‌ను ఎన్నికల అధికారిగా నియమించారు. తాజాగా పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు తుది దశకు చేరింది. ఇక పోలింగ్‌ సిబ్బంది నియామకం చేసి శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే కోవిడ్‌ విస్తృతి నేపథ్యంలో ఆన్‌లైన్‌ నామినేషన్లు, ప్రచారానికి స్పష్టమైన నియంత్రణలను నిర్ధేశించింది. ఇక కీలక ఘట్టంగా పేర్కొనే నోటిఫికేషన్‌ జారీతో పుర పోరుకు తెరలేవనుంది. తుది ఓటర్ల జాబితా వెల్లడించిన తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్ధసారథి ప్రతిరోజూ ఒక్కో సమీక్షతో వేగంగా ఎన్నికల నిర్వహణకు అనువుగా పావులు కదుపుతూ సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు.
సర్వం సిద్ధం
ఇక అత్యంత కీలకమైన రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల జాబితాపై తుది దశకు ఈసీ చేరింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేష న్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూర్‌ మునిసిపాలిటీలకు పలు పంచాయతీల్లో ఖాళీ అయిన వార్డు సభ్యులు, ఎంపీటీసిలు, ఒక జడ్పీటీసి స్థానానికి ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ వేగవంతం చేశారు.
నోటిఫికేషన్‌ నుంచి ఎన్నికల వరకు 15 రోజులే గడువు
పురపాలక ఎన్నికల నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా మొత్తం 15 రోజుల్లోనే ఎన్నికల తతంగాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వం చట్టసవరణ చేసింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955లో మార్పులు చేస్తూ సెక్షన్‌ 33ను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చట్ట సవరణలో ప్రధానంగా నామినేషన్ల దాఖలకు మూడు రోజులకు మించకుండా గడువు నిర్దేశించింది. నామినేషన్ల పరిశీలనకు తర్వాతి రోజును కేటాయించింది. అనంతరం వరుసగా మరుసటి రోజును ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అంటే వడివడిగా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘాన్ని సమాయాత్తం చేసేలా వ్యవహారం సాగించింది. మొత్తం నోటిఫికేషన్‌ జారీ నుంచి ఎన్నికలకు 15 రోజుల గడువును ఖరారు చేశారు. అంటే మొత్తం ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లో ముగించాలన్న లక్ష్యంతో ఈ సవరణలు చేశారు. ఇందులో నామినేషన్‌ల స్వీకరణ నుంచి పోలింగ్‌ వరకు 7 రోజుల గడువు మాత్రమే పార్టీలకు ప్రచారానికి అనుకూలంగా నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement