మీడియా సెంటర్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్ షాప్ లో సహచర మంత్రి సత్యవతి రాథోడ్, మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి, అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు వివక్ష అంటూ లేని రంగం లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని రాణించాలన్నారు. మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహించిన చైర్మన్ అల్లం నారాయణను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో సగమై నేడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, అత్యంత క్లిష్టమైన జర్నలిజం రంగంలో రాణించడం గొప్ప విషయమన్నారు. అందరి కోసం ఒక వేదిక ఏర్పాటుకు కృషి చేసిన అకాడమిని ప్రశంసిస్తూ… అందరూ ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. పురుషులతో సమానంగా సంపాదిస్తున్న.. అంతకన్నా ఎక్కువగా వత్తిడికి గురవుతున్న, చేసే పనిని నిబద్ధతతో చేస్తూ.. రాణిస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. రాజకీయాల్లో వచ్చిన మొదట్లో తనను గరిట తిప్పే వాళ్ళతో ఏమవుతుందన్న మాటలను ఛాలెంజ్ గా తీసుకొని పనిచేసానని మంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, నేడు పునర్నిర్మాణంలో కూడా మీ పాత్ర అమోఘమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. నాడు తెలంగాణ ఉద్యమం సమయంలో హోంమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి రెండుగంటలకు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసి ఆందోళనలో పాల్గొంటే కీసర పోలీస్ స్టేషన్ లో ఉంచారని తెల్పితే, ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకున్నట్లు, ఉద్యమంలో ఏం చేసారనే వాళ్లకు ఇలాంటి అనేక సంఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. రెండు రోజుల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, సీనియర్ పాత్రికేయుల అనుభవాలు తెలుసుకొని, భవిష్యత్తులో మరింతగా రాణించాలని మంత్రి పిలుపునిచ్చారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement