Saturday, November 23, 2024

ఆర్టీసీలో వీఆర్‌ఎస్…

హైదరాబాద్, : ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీం (వీఆర్‌ఎస్‌) అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉద్యోగులను 50 శాతానికి పరిమితం చేయాలన్న యోజనలో యాజమాన్యం ఉంది. ఇందులో భాగంగా సంస్థలో 55 ఏళ్ళు పైబడిన వారిని, 33 ఏళ్ల సర్వీసు ఉన్న వారిని ఇంటికి పంపనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత మందిని కార్గో విభాగానికి పంపించిన యాజమాన్యం మరికొందరిని ఇతర డిపార్టు మెంట్లలో సర్దుబాటు చేయనున్నారు. ఫైర్‌ పోలీస్‌ డిపార్లమెంట్లకు కొంత మంది డ్రైవర్లను అడ్జస్ట్‌ చేశారు. సమ్మె తర్వాత ఆర్టీసీ విడుదల చేసిన డేటా ప్రకారం 49,733 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల యాజమాన్యం విడుదల చేసిన డేటా ప్రకారం సంస్థలో మొత్తం 48,394 మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను సగానికి తగ్గిస్తే సంస్థపై కొంత ఆర్థిక భారం తగ్గనుందన్నది యాజమాన్యం ఆలోచన. వాస్తవానికి 2019 సమ్మె కాలంలోనే కొంత మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ కింద పంపించాలని భావించినప్పటికీ అప్పట్లో ఉన్న కారణాలతో అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం సంస్థకున్న ఆర్థిక ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలకు తోడుగా వేతన పెంపు భారం తడిసి మోపెడు కానుండటంతో ఉన్న సిబ్బంది లో కొంత మందిని తగ్గించకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా ప్రత్యేక ప్యాకేజీలతో వీఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించనున్నారు.
ప్రస్తుతం వీఆర్‌ఎస్‌ కింద పోగా మరింత మందిని ఇతర డిపార్టుమెంట్లలో సర్దుబాటు చేసే ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల స్టాఫ్‌ కావాలని పంచాయితీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ, ఇరిగేషన్‌ డిపార్టు మెంట్లు ఆర్టీసీకి లేఖలు రాసినట్లు సమాచారం. ఆర్టీసీ కూడా ఇస్తామని తిరిగి లేఖలు రాసినట్లు తెలిసింది. పోలీస్‌ డిపార్టుమెంట్‌ కూడా రెండు వేల మంది డ్రైవర్లు కావాలని అడిగినట్లు సమాచారం. ఇప్పటికే ఫైర్‌ డిపార్టుమెంట్‌కు మూడు వేల మంది దాకా డ్రైవర్లను పంపించారు. ఆ శాఖ ఇంకా కావాలని అడి గింది. డ్రైవర్లతో పాటు కండక్టర్లను ఇతర పనులకు ఉప యోగించుకోవాలని భావిస్తున్నారు. కార్గో సర్వీసులు విస్తరించాలన్న సంకల్పంతో ఉన్న యాజమాన్యం క్లరికల్‌ స్టాఫ్‌ను కూడా బుకింగ్‌ స్టాఫ్‌గా మార్చాలన్న యోచనలో ఉంది.
వీఆర్‌ఎస్‌కు డబ్బులను వివిధ మార్గాల ద్వారా సమీకరించాలని ఆలోచిస్తున్నారు. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1,500 కోట్లు కేటాయించింది. మరో రూ.1,500 కోట్లు బడ్జెటేతర నిధులు సమకూర్చుతామని ప్రకటించింది. ఇప్పటికే అనేక చోట్ల ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇచ్చారు. మరికొన్ని చోట్ల ఆర్టీసీ ఆస్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా లీజుకు ఇచ్చి డబ్బులను సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. కార్గో కోసం కొన్ని బస్సులను సరుకు రవాణా వాహనాలుగా మార్చారు. మినీ బస్సులు పూర్తిగా సరుకు రవాణా కోసం వాడుకుం టున్నారు. ఇలా బస్సుల సంఖ్య తగ్గడంతో ఇప్పుడున్న అన్ని డిపోలు అవసరం లేదనే భావనకు అధికారులు వచ్చారు. దగ్గరలో ఉన్న రెండు, మూడు డిపోలను కలిపి ఒకటి లేదా రెండుగా మెర్జ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. తద్వారా క్లరికల్‌ స్టాఫ్‌తో పాటు డీఎం స్థాయి అధికారులను కూడా తగ్గించేందుకు వీలవుతుందని అధికారులు అంటున్నారు.t

Advertisement

తాజా వార్తలు

Advertisement