Tuesday, November 26, 2024

లక్ష్మీనారాయణ మృతి పట్ల వినోద్ కుమార్ దిగ్భ్రాంతి

బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.సికింద్రాబాద్ లోని వెస్ట్ మారెడ్ పల్లి నివాసంలో లక్ష్మీనారాయణ భౌతిక దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, ఏ.ఐ.బీ.ఇ.ఏ జాతీయ ఉపాధ్యక్షులు, ట్రేడ్ యూనియన్ జాతీయ నాయకులు, గొప్ప మార్క్సిస్టు నాయకులు, సామాజికవేత్త పీ. లక్ష్మీనారాయణ ( సేటు ) (83) మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు.

ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…ట్రేడ్ యూనియన్ చరిత్రలో లక్ష్మీనారాయణ చెరగని ముద్ర వేశారని, వైశ్య కుటుంబంలో పుట్టిన లక్ష్మీనారాయణ మార్క్సిస్టు అడుగు జాడల్లో నడిచారన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( సీ.పీ.ఐ ) కి అనుబంధంగా ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో లక్ష్మీనారాయణ క్రియాశీలక పాత్రను పోషించారన్నారు. అన్ని బ్యాంకుల ఉద్యోగుల యూనియన్ వరంగల్ జిల్లా నాయకులుగా, ఆజంజాహి మిల్లు, విద్యా సంస్థలు, బీడీ కార్మికులు, వివిధ ట్రేడ్ యూనియన్ ఉద్యమ కార్యక్రమాల్లో లక్ష్మీనారాయణ తోడ్పాటును ఇచ్చారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలను ప్రోత్సాహం ఇచ్చారని, విద్యార్థి సంఘ నాయకునిగా లక్ష్మీ నారాయణతో తనకు అనుబంధం ఉందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. గొప్ప మానవతావాది, సామాజికవేత్త, పేదల పెన్నిధి, ప్రజా సంఘాలకు వారధిగా లక్ష్మీనారాయణ ఆదర్శవంత జీవితాన్ని గడిపారని అన్నారు. ఇండో – సోవియట్ కల్చరల్ సొసైటీ నాయకులుగా, రైతు కూలీ సంఘం సమావేశాల ఏర్పాటులో లక్ష్మీనారాయణ కీలక పాత్రను పోషించారని తెలిపారు. ప్రొ. జయశంకర్, ప్రొ. వరవరరావు, ప్రొ. హరగోపాల్, సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వర రావు, సీ. రాఘవచారి, డా. రామనాథం, కాళిదాసు, భగవాన్ దాస్, ఎంసీపీఐ నాయకులు ఓంకార్, జీవన్ కుమార్ వంటి వ్యక్తులతో కలిసి లక్ష్మీనారాయణ పని చేశారని ఆయన తెలిపారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎం ఎల్), ఎంసీపీఐ సహా అనేక ప్రజా సంఘాలతో లక్ష్మీనారాయణకు విడదీయరాని అనుబంధం ఉందని ఆయన తెలిపారు. లక్ష్మీనారాయణ మృతి వరంగల్ జిల్లా బ్యాంకు ఉద్యోగులు, కార్మిక, కర్షక, ట్రేడ్ యూనియన్ వర్గాలకు, బలహీన, బడుగు వర్గాలకు తీరని నష్టమ‌ని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement