Saturday, November 23, 2024

హైదరాబాద్ సిటీలో చాలా డేంజర్.. రోడ్డు దాటాలంటే కష్టమే

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : కోటీకి పైగా జనాభా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో రోడ్డు దాటడం పాదచారులకు ప్రాణాలతో చెలగాటంగా మారింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మెరుపు వేగంతో వచ్చే వాహనాలకు బలి కావాల్సిందే. పంజాగుట్ట, అమీర్‌పేట, ఈఎస్‌ఐ, కూకట్‌పల్లి, ఆబిడ్స్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌ తదితర రద్దీ ప్రాంతాల్లో అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని పాదచారులు రోడ్డు దాటుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 200 మందికి పైగా మృత్యువాత పడుతుండగా వందలాది మంది గాయాల పాలవుతున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్న బ్లాక్‌ స్పాట్లను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు విఫలమవుతున్నారు. బస్సులు మార్చే ప్రయాణీకులు నిర్దేశిత ప్రాంతం నుంచి కాకుండా బస్టాప్‌ నుంచి నేరుగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించడం వల్ల తరుచూ పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండేండ్ల క్రితం జీహెహెంసీ నగరంలో 28 రద్దీ ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు పుటోవర్‌ బ్రిడ్జీల నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటి వరకు అందులో సగం కూడా ప్రారంభానికి నోచుకోలేదు. అలాగే నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పాదచారుల భద్రత కోసం పాదచారుల సిగ్నళ్లను ఏర్పాటు చేయడంపై పోలీసులు దృష్టి సారిచండం లేదని ఆరోపణలున్నాయి. పాదచారుల ప్రమాద రహిత నగరంగా గ్రేటర్‌ను తీర్చిదిద్దాల్సిన బల్దియా అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

మెట్రో లిఫ్ట్‌లపై అవగాహన కరవు..

హైదరాబాద్‌ నగరంలో రోడ్డు దాటే పాదచారులకు మెట్రోలిఫ్ట్‌లపై అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలు కారణంగా భావిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో 57 మెట్రోస్టేషన్లలో రోడ్డుకు ఇరువైపులా లిఫ్ట్‌లున్నాయి. రోడ్డు దాటే పాదచారులు మెట్రోలిఫ్ట్‌లను ఉపయోగించుకుని రోడ్డు దాటాలని మెట్రో యాజమాన్యం అన్ని స్టేషన్ల వద్ద బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. అయితే చాలా మందికి ఈ విషయం తెలియక పక్కనున్న మెట్రోలిఫ్ట్‌ను కాదని నేరుగా రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇందుకు సంబంధించి ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయాణికులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement