Tuesday, November 26, 2024

రెండో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపుతో 87 మంది ఇంటికి – అధీక్యంలో సుర‌భి…

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో తొలి ప్రాధాన్య ఓట్లు 7రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి దూసుకు పోయింది. తొలి ప్రాధాన్యం లెక్కింపు పూర్తయిన తర్వాత వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,04,668 ఓట్లు లభించా యి. దీంతో తొలి ప్రాధాన్యంలో 8,021 ఓట్ల ఆధిక్యం దక్కింది. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 53,610 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ అభ్యర్థి రమ ణకు 5,973 ఓట్లు లభించాయి. ఇక్కడ చెల్లని ఓట్లు 21,309 ఉండడం గమనార్హం. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపును కొన‌సాగిస్తున్నారు.. పోలింగ్‌ జాప్యం నేపథ్యంలో రెండోరౌండ్‌లో టేబుళ్ళ సంఖ్యను పెంచి చకచకా కౌంటింగ్ ను ముమ్మ‌రం చేశారు.. నేటి రాత్రికి తుది ఫలితం వ‌చ్చే అవ‌కాశం ఉంది.. కాగా, రెండో ప్రాధాన్య‌త క్ర‌మం ఓటింగ్ లో భాగంగా అతి త‌క్కువ ఓట్లు వ‌చ్చిన ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు.. ఎలిమినేషన్‌ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు కలిపారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి 3,930 ఎలిమినేషన్‌ ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుకు 1,919, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావుకు 2,477, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 2,044 ఎలిమినేషన్‌ ఓట్లు లభించాయి. ఎలిమినేష‌న్ పూర్తి అయిన త‌ర్వాత‌ బీజేపీ అభ్యర్థిపై వాణీదేవి 10,035 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు వాణీదేవికి 1,16,619 ఓట్లు, రాంచందర్‌రావుకు 1,06,584, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావుకు 56,087, చిన్నారెడ్డికి 33,598 ఓట్లు లభించాయి. ఇక్కడ అభ్యర్థి విజయానికి 1,68,520 ఓట్లు అవసరం. రెండో ప్రాధాన్య‌త‌లోనూ 50శాతం ఓట్లు ఏ అభ్య‌ర్ధి సాధించ‌క‌పోయిన‌ట్ల‌యితే మూడో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపు కూడా చేప‌ట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు… అదే జ‌రిగితే ఫ‌లితం ఆదివారం నాడు వెలువ‌డే అవ‌కాశం ఉంది.

చెల్ల‌ని ఓట్ల‌పై వాణీదేవి ఆవేద‌న‌…

చదువుకున్న వారు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు సరిగా వేయలేక పోయారు.. ఇదేనా? చదువుకున్న తర్వాత నేర్చుకుందని హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణిదేవి అసహనం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఓట్ల కౌంటింగ్‌ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ. ఓటు వేసిందంతా డిగ్రీలు, పీజీలు చేసిన వారేనని, కానీ ఈ ఎన్నికల్లో 21వేల మంది ఓట్లు చెల్లనివిగా మారాయంటే బాధేస్తోందన్నారు. ఇవేనా మన చదువులు, చదువుకున్న వారు ఇట్లాగేనా? ఓటు వేసేదని ప్రశ్నించారు. అంతా మామూలు వారు కాదు.. అంతా చదువుకున్నారు. ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కానీ ఓటు వేయడం రాదా అని ప్రశ్నించారు. మనం మన విద్యా ప్రమాణాలను పెంచుకోవాలని ఈ పరిణామం తెలియజేస్తోం దన్నారు. 30 ఏళ్లుగా టీచింగ్‌ ప్రొఫెషన్‌లో ఉన్న.. చెల్లని ఓట్లను చూసి సిగ్గు పడుతున్నా.. ఇప్పుడు బోధనా సిబ్బందిగా మమ్మల్ని మేం ప్రశ్నించుకుం టామని ఆవేదన వ్యక్తంచేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందని, గెలుపు తనదేనని ధీమా వ్యక్తంచేశారు. సెకండ్‌ ప్రయారిటీ ఓట్లు వస్తాయని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కాగా నల్లగొండలో 21,636 ఓట్లు చెల్లలేదు…

Advertisement

తాజా వార్తలు

Advertisement