హైదరాబాద్ – రేపటి నుంచి పట్టాలపై పరుగులు తీయనున్న సింకింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణ ఛార్జీలను రైల్వే శాఖ వెల్లడించింది. విశాఖ – సికింద్రాబాద్ మధ్య ఒక్కరికి చైర్ కార్ ధ రూ. 1,720 , ఎగ్జిక్యూటీవ్ క్లాస్ ధర రూ.3,170. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఒక్కరికి రూ.905 (ఛైర్ కార్), రూ.1775 (ఎగ్జిక్యూటివ్ క్లాస్) ఇక సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి రూ.1365 (ఛైర్ కార్), రూ.2485 (ఎగ్జిక్యూటివ్ క్లాస్). ఈ టిక్కెట్ ధరలో క్యాటరింగ్ ఛార్జీలు కూడా ఉన్నాయి..భోజన సదుపాయం వద్దనుకుంటే ఛార్జీలు కాస్త తగ్గుతాయి..
ఈ ట్రైన్ సోమవారం నుంచి శనివారం వరకు విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య ప్రయాణం కొనసాగించనుంది. ఆదివారం ఈ రైలు ప్రయాణానికి సెలవు ప్రకటించారు. ఇక విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు (20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు వైజాగ్ స్టేషన్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైలు (20834) మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఒక నిమిషం పాటు ఆగనుంది. ఇందులో మొత్తం 14 ఏసీ ఛైర్ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య ఉన్న 700కిలో మీటర్ల దూరాన్ని రైలు 8 గంటల 40నిమిషాలలో చేరుకుంటుంది.
కాగా, ఈ రైలును ఈ నెల 15న ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 8.45 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఆ ఒక్కరోజు మాత్రం ఈ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. శుక్రవారం నాటికి ఇంకా దీనికి టిక్కెట్ ధరలను ఖరారు చేయలేదు. శనివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.